కరోనా మహమ్మారి ఓ వైద్యాధికారిని పొట్టనబెట్టుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జి. నరేష్ కుమార్ కరోనా సోకి మరణించారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన డాక్టర్ నరేష్ కుమార్ హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.
జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ నరేష్ కుమార్ కరోనా విధుల్లో చురుగ్గా పాల్గొన్నారు. మణుగూరు క్వారంటైన్ కేంద్రం ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలోనే ఆయన కరోనా బారిన పడినట్లు సమాచారం.
సౌమ్యుడిగా ప్రాచుర్యం పొందిన డాక్టర్ నరేష్ కుమార్ ఇమ్యునైజేషన్ విభాగంలో జిల్లాను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు అహర్నిశలు పాటుపడ్డారని సహ ఉద్యోగులు కొనియాడారు. డాక్టర్ నరేష్ కుమార్ మరణవార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కనికరం లేని కరోనా: కలెక్టర్ దిగ్భ్రాంతి
కనికరం లేని కరోనా ఒక వీరుడ్ని బలితీసుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా. ఎంవి రెడ్డి అన్నారు. ఇటీవలే వైద్య విద్యలో పీజీ సాధించిన నరేష్ కొన్ని రోజుల్లో ఉన్నత చదువులకు వెళ్లాల్సి ఉన్న సమయంలో కరోనాతో మరణించడం చాలా దురదృష్టకరమన్నారు. విధులపట్ల అంకిత భావం కలిగిన యువ వైద్యుడ్ని జిల్లా ప్రజలు కోల్పోయారని, జిల్లాలో కరోనా కట్టడిలో డా. నరేష్ సేవలు మరువలేనివని అన్నారు. మణుగూరు క్వారంటైన్ కేంద్రం ఇంచార్జ్ అధికారిగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సమయంలో నరేష్ కు కరోనా సోకడం అత్యంత బాధాకరమన్నారు. ప్రజా రక్షణలో వైద్యుడు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని ఆకస్మిక మరణం జిల్లా ప్రజలకు తీరని లోటని, ఈ రోజు ఒక ఆత్మీయుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా ముందుండి పోరాడే వైద్య సిబ్బందిని కూడా వ్యాధి కనికరం లేకుండా బలితీసుకుందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.