ఒక వ్యక్తికి తన బలంతో పాటు బలహీలతలు తెలిసి ఉండడం మంచిది. అలాగే ప్రత్యర్థుల బలంతో పాటు వారి బలహీనతలు తెలియడం మంచిది.
వాస్తవానికి విజయం ఒక్క బలంపై మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రత్యర్థి బలహీనత తెలియడంపై ఆధారపడి ఉంటుంది.
రావణుడి బలహీనత నాభిలో ఉంది. బాణం నాభిలో దించితే విజయం లభిస్తుంది.
వాలి బలహీనత ప్రత్యర్థిగా ఎదురుగా నిలబడకపోవడంలో ఉంది. చాటునుండి యుద్ధం చేస్తే విజయం వస్తుంది.
దుర్యోధనుడి బలం ఊరువుల్లో ఉంది. తొడలు చితక్కొడితే విజయం వరిస్తుంది.
ధర్మరాజు బలహీనత జూదం. ఆ జూదానికి రెచ్చగొట్టి అక్కడ ఓడిస్తే ప్రత్యర్థికి విజయం లభిస్తుంది.
కర్ణుడి బలం కవచకుండలాలు. అవి తీసేసుకుంటే తేలిగ్గా అంతం చేయవచ్చు.
ఒక వ్యక్తి బలాన్ని జాగ్రత్తగా చూస్తే అందులోనే బలహీనత కనిపిస్తుంది. ప్రత్యర్థిపై గెలవాలంటే బలం ఒక్కటే సరిపోకపోవచ్చు. స్వంత బలహీనత తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలి. అలాగే ప్రత్యర్థి బలం, బలహీనత రెండూ తెలుసుకోవాలి.
జరాసంధుడు శరీరాన్ని రెండుగా చీల్చగల బలం భీముడికి ఉన్నా ఆ జరాసంధుడు బలహీనత తెలియకపోతే ఆ శరీరం ఎన్నిసార్లు చీల్చినా మళ్ళీ జరాసంధుడు సజీవుడవుతాడు.
ఈ బలం, బలహీనతలే కాక, ప్రత్యర్థిపై పోటీకి బరిలోకి ఎవరిని దింపాలి అనే విషయంలో కూడా అవగాహన ఉండాలి. అదే వ్యూహం.
బ్రహ్మనాయుడు ఏ జాతి (రంగు) పుంజును బరిలోకి దింపుతున్నాడో నాగమ్మకు తెలియాలి. అప్పుడే గట్టి పోటీ ఇవ్వగల పుంజును నాగమ్మ ఎంచుకోగలుగుతుంది. అయితే నాగమ్మ తన పుంజుకు విషపు కత్తి కట్టిన విషయం (వ్యూహం లేదా కుట్ర) గ్రహించలేకపోతే బ్రహ్మనాయుడికి పరాజయమే మిగులుతుంది.
రావణుడి కుమారుడు ఇంద్రజిత్ ని (మేఘనాధుడు) జయించాలంటే రాముడి బలం పనికిరాదు. శేషనాగు అంశతో పుట్టిన లక్ష్మణుడు సరైన ప్రత్యర్థి.
దుర్యోధనుడిపై యుద్దానికి భీముణ్ణి బరిలోకి దించాలి, అర్జునుణ్ణి కాదు.
కర్ణుడిపై పోరుకు అర్జునుడే బరిలోకి దిగాలి.
హిరణ్యకశ్యపుడిపై నరసింహుడే బరిలోకి దిగాలి. నరుడు కాదు. సింహం కాదు.
ప్రత్యర్థిపై గెలవాలంటే సమయం, సందర్భం కూడా ముఖ్యమే. కీచకుడిని రణరంగంలో వీరోచితంగా పోరాడుతున్నప్పుడు గెలవలేం. అతడిలో వీరత్వం, రౌద్ర రసం నిద్రిస్తున్న వేళ, శృంగార మత్తులో ఏకాంతంలో మాత్రమే అంతం చేయడం భీముడికైనా సాధ్యం.
ఇలా చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే విజయం అంత తేలిగ్గా వరించదు.
వరించిన ఎంత పెద్ద విజయం అయినా అది తరచుగా వైఫల్యాలను అందిస్తుంది.
✍️ గోపి దారా