తెలంగాణా సెక్రటేరియట్ ‘బీట్’ చూసే జర్నలిస్టులకు చిర్రెత్తుకొచ్చింది. ఆ… ఒస్తే… జర్నలిస్టులు ఏం చేస్తారు? అని ప్రశ్నిస్తే… ఇదిగో ఇలా తమ నిరసన వ్యక్తం చేస్తారు మరి. విసుగుతో జర్నలిస్టులే ఏర్పాటు చేసుకున్న ఈ ‘మీడియా పాయింట్’ వద్ద రాజకీయ నేతలు నోరు విప్పి మాట్లాడగలరా? అనేదే అసలు సందేహం. ఇంతకీ విషయమేమిటంటే…?
తెలంగాణా సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియలో భాగంగా అక్కడ తమ విధులు నిర్వహించే జర్నలిస్టులు ‘దిక్కు’లేని పక్షుల్లా మారారు. బీఆర్కే భవనంలోకి ప్రభుత్వం ఎలాగూ జర్నలిస్టులను అనుమతించడం లేదు. ఏం చేయాలో సెక్రటేరియట్ జర్నలిస్టులకు పాలుపోలేదు. అధికారులకు తమ పరిస్థితిని విన్నవించుకున్నారు. తమకంటూ ఓ చోట కాస్త ‘మీడియా పాయింట్’ కేటాయించాలని కోరారు.
న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తమకు మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. కనీసం బీఆర్కే భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియా పాయింట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ ఎటువంటి ఫలితమూ లేకపోయింది. చివరికి బీఆర్కే భవన్ ముందు జర్నలిస్టులే స్వయంగా ఓ ‘మీడియా పాయింట్’ను ఇలా ఏర్పాటు చేసుకున్నారు.
ప్రభుత్వాధికారులు స్పందించకపోయినా జర్నలిస్టులే స్వయంగా ఏదోవిధంగా మీడియా పాయింట్ ను ఏర్పాటు చేసుకున్నారు కదా? సమస్య తీరిపోయింది కదా? అనుకుంటే పొరపాటే అవుతుంది. ఆయా మీడియా పాయింట్ ఎక్కడుందో దిగువన గల వీడియోలో చూడండి. బీఆర్కే భవన్ బయట గల ‘ప్రయివేట్ పబ్లిక్ టాయ్ లెట్’ గోడకు ‘సెక్రటేరియట్ మీడియా పాయింట్’ అని ఓ ఫ్లెక్సీని తగిలించి జర్నలిస్టులు ఇలా తమ నిరసన తెలిపారన్నమాట.
ఇప్పటికైనా అధికారులు స్పందించి సెక్రటేరియట్ బీట్ చూసే రిపోర్టర్ల కోసం మీడియా పాయింట్ ఏర్పాటు చేస్తారో? లేక తాము మీడియాకు చెప్పాల్సిన విషయాలను మన రాజకీయ నేతలు ఇక్కడే నిలబడి టాయిలెట్ సువాసనను ఆస్వాదిస్తూ చెబుతారో వేచి చూడాలి మరి!