ప్రభుత్వ విధులు నిర్వహించాల్సిన కొందరు అధికారులు ఎందుకోగాని కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. తమ పరిధి దాటి ప్రవర్తిస్తూ విమర్శల పాలవుతుంటారు. ఇంకొందరు అధికారులైతే అధికార పార్టీ జెండాతో చొక్కా కుట్టించుకున్న తరహాలోనూ ప్రవర్తిస్తుంటారు. ఇటువంటి అధికారులు అనేక సందర్భాల్లో విపక్ష పార్టీల నుంచి ఆరోపణలను, విమర్శలను చవి చూస్తుంటారు. గతంలో అనేక మంది ప్రభుత్వాధికారులు ఇటువంటి ఘటనల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కున్న దాఖలాలు అనేకం ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం సమాచార, పౌర సంబంధాల శాఖ విభాగంలోని ఓ అధికారి తీరు కూడా ఇదే కోవలోకి వస్తుందనే వ్యాఖ్యలు తాజాగా వినిపిస్తున్నాయి.
సమాచార, పౌర సంబంధాల శాఖ గురించి తెలుసు కదా? ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు బాధ్యతలు నిర్దేశించిన ప్రచార విభాగపు సర్కారీ శాఖ. ఇందుకోసమే ఈ విభాగాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా నిర్వహిస్తుంటుంది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార శాఖ విభాగానికి చెందిన అధికారులు కొందరు మరీ అత్యుత్సాహంతో పనిచేస్తూ అధికార పార్టీ సమావేశాలకు సంబంధించిన కార్యక్రమాల కవరేజ్ సేవలోనూ తరిస్తున్నట్లు కనిపిస్తోంది.
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అప్పారావుపేటలో గల పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు. అనంతరం హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఫ్యాక్టరీ ఆవరణలో మొక్కలు కూడా నాటారు. అధికారికంగా నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్న ఫొటోలు, సమాచారాన్ని మీడియాకు అందించడం డీపీఆర్వో కార్యాలయ సిబ్బంది విధుల్లో భాగం. ఇందులో తప్పు పట్టాల్సిన అంశం కూడా ఏమీ ఉండదు.
కానీ ఇక్కడ కనిపిస్తున్న ఫొటోను నిశితంగా పరిశీలించండి. అశ్వారావుపేట నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన మంత్రి పువ్వాడ అజయ్ పనిలో పనిగా పార్టీ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు ఇదే రోజు దమ్మపేటలో నిర్వహించిన అశ్వారావుపేట టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యల గురించి టీఆర్ఎస్ కేడర్ కు దిశా, నిర్దేశం కూడా చేశారు.
ఇదిగో ఈ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ సమావేశానికి సంబంధించిన ఫొటోలను కూడా భద్రాద్రి కొత్తగూడెం డీపీఆర్వో తన భుజస్కంధాలపై వేసుకుని మరీ మీడియాకు విడుదల చేయడమే అసలు విశేషం. ‘118 అశ్వారావుపేట డీపీఆర్వో అండ్ ప్రెస్’ అనే వాట్సాప్ గ్రూపు ద్వారా ఈ పొటోలను అందించడం గమనార్హం. ఈ గ్రూపును 2018 నవంబర్ 13న డీపీఆర్వో శ్రీనివాస్ క్రియేట్ చేసినట్లు వాట్సాప్ గ్రూపులో వివరాలు కనిపిన్నాయి. గ్రూపు క్రియేట్ చేసిన అధికారి వినియోగించే ఫోన్ నెంబర్ ద్వారానే పార్టీ కార్యకర్తల సమావేశపు ఫొటోలు షేర్ కావడం గమనించాల్సిన అంశం.
అధికారిక కార్యక్రమాలనే కాదు… పార్టీ వ్యవహారాల కవరేజ్ కు సంబంధించిన ఫొటోలను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం డీపీఆర్వో తరహా అత్యుత్సాహపు అధికారులు ఉంటే అధికార పార్టీ నాయకులకు వ్యక్తిగత పీఆర్వోల నెలవారీ వేతనాల ఖర్చు కూడా తప్పుతుందనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.
అయితే ఫొటోలు తాను తీయలేదని బహుషా డీపీఆర్వో వాదించవచ్చని, కానీ తాను క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపులో, తన ఫోన్ నెంబర్ ద్వారా పార్టీ సమావేశపు ఫొటోలు జారీ కావడం బాధ్యతారాహిత్యమే అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదీ సంగతి.