ఎగువన గల గ్రామ పంచాయతీ రశీదును నిశితంగా పరిశీలించండి. చిల్లర జమలకు ఇచ్చే రశీదు అన్నమాట. ప్రసాద్ అనే వ్యక్తి రూ. కోవిడ్-19 నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. మాస్కు ధరించనందుకు ఆయనకు రూ.1,000 జరిమానా విధించారు. ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరో సామాన్యుడు కాదు… జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పశు వైద్యాధికారి. బుధవారం జరిగిన కొడిమ్యాల మండల పరిషత్ సమావేశానికి ఆయన మాస్క్ ధరించకుండా హాజరయ్యారనే అభియోగంపై ఆయా మొత్తపు జరిమానా విధించారు. కరోనా కల్లోల పరిణామాల్లో పశువైద్యాధికారి ప్రసాద్ మాస్కు లేకుండా హాజరైన తీరుపై చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు వార్తల సారాంశం. మాస్కు లేకుండా సదరు పశు వైద్యాధికారి సమావేశానికి హాజరు కావడం ఖచ్చితంగా కరోనా నిబంధనల ఉల్లంఘనే. ఇందులో ఏ సందేహమూ లేదు. కానీ ఈ దిగువన గల వీడియోను కూడా ఓసారి వీక్షించండి.
చూశారు కదా వీడియోను ఆసాంతం…? చేతిలో కాగితాల కట్ట ఏదో పట్టుకుని, తనకు ఫైన్ విధించినందుకు పశువైద్యాధికారి ప్రసాద్ కూడా ఇబ్బందిగానే ఫీలవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇదే వీడియోలో మరొకాయన మాస్కు లేకుండా కుర్చీలో కూర్చుని ప్రసాద్ వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నారు… గమనించారా? ఆయన మరెవరో కాదు. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకరే. తనకూ మాస్కు లేదు కదా అంటారా? ఆ ఒక్కటీ అడక్కండి. కోవిడ్-19 ఉల్లంఘనలు అధికారులకు మాత్రమే వర్తిస్తాయేమో మరి!