దొంగలు రకరకాలు. చిల్లర దొంగలు. గజదొంగలు… బందిపోటు దొంగలు… దొంగతనం చేసేవాడు దొంగ. దొంగిలించిన సొత్తును బట్టి దొంగ సత్తువేంటో, వాడి స్థాయి ఏంటో పోలీసులు నిర్ధారించి నిర్ణయిస్తారు. కానీ ఘటన విషయంలో పోలీసులను బురిడీ కొట్టిస్తూ ఫిర్యాదు చేసే వారిని ఏ తరహాలో వ్యవహరించాలి? ఇదీ అసలు ప్రశ్న. విషయమేమిటంటే…
దాదాపు వారం క్రితం అంటే ఈనెల 22న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని గడిమహల్ కు చెందిన కుడిది వనిత ఆనే ఆవిడ ఇంట్లో దొంగలు పడ్డారు. ఆవిడ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఘటన జరిగిన రోజు రాత్రి గుర్తు తెలియని దొంగలు తమ ఇంట్లో చొరబడి ఏడు తులాల బంగారు నగలను, లక్ష రూపాయల నగదునే గాక, రెండు మొబైల్ ఫోన్లను కూడా ఎత్తుకుపోయారనేది వనిత చేసిన ఫిర్యాదు సారాంశం.
ఇంత భారీ చోరీ జరిగాక సహజంగానే పోలీసు ఉన్నతాధికారులు నుంచి సంబంధిత స్టేషన్ అధికారులకు, సిబ్బందికి ‘అక్షింతలు’ పడుతూనే ఉంటాయి. కేసును ఛేదించడంలో, దొంగలను అరెస్ట్ చేయడంలో, సొత్తును రికవరీ చేయడంలో సంబంధిత స్టేషన్ పోలీసులకు ఇది మామూలే. ఇంకేముంది సుల్తానాబాద్ సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ ఉపేందర్ ఆధ్వర్యంలో పోలీసులు నానా తిప్పలు పడి ఎట్టకేలకు నిందితులైన కుంంజం రవి, బోదాసు రాంబాబాబు అనే ఇద్దరు దొంగలను బుధవారం అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత ప్రక్రియలో పోలీసులు తమదైన పద్ధతిలో దొంగలను విచారణ చేస్తుంటారు కదా? బాధితురాలైన వనిత ఇంట్లో దోచుకున్న ఏడు తులాల బంగారాన్ని, లక్ష రూపాయల నగదును ఎక్కడ దాచారో చెప్పాలని ప్రశ్నించారు. పోలీసులు ఎంతగా తిప్పలు పడినా ప్రయోజనం లేకపోయింది. ‘అయ్య బాబోయ్… మేమేదో మట్టి పని చేసుకుని బతికేస్తుంటాం. పనీ, పాటా లేనప్పుడు ఖర్చులకు మరీ ఇబ్బంది ఏర్పడినపుడు తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చిల్లర దొంగతనాలు చేసుకుని బతికేస్తుంటాం. ఇంటి ముందు గల చిన్న చిన్న సామాన్లను ఎత్తుకుపోయి అమ్ముకుని ఖర్చులు వెళ్లదీసుకుంటుంటాం. వనిత ఇంట్లో రెండు సెల్ ఫోన్లు తప్ప ‘చీపురు పుల్ల’ కూడా మేం ముట్టుకోలేదు మహాప్రభో…’ అని ఆ ఇద్దరు దొంగలు కుండబద్దలు కొట్టారు.
అన్ని పద్ధతుల ద్వారా దొంగలను అడిగీ, అడిగీ విసుగొచ్చిన పోలీసులకు ఎక్కడో కాస్త అనుమానం కలిగింది. ఎందుకైనా మంచిదని చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన బాధితురాలు వనితను స్టేషన్ కు పిలిపించారు. కాస్త కటువుగానే ప్రశ్నించారు. బెంబేలెత్తిన వనిత అసలు విషయాన్ని గడగడా కక్కక తప్పలేదు. ఇంతకీ వనిత ఏం చెప్పిందో తెలుసా….?
‘మా ఇంట్లో చోరీకి గురైంది రెండు సెల్ ఫోన్లు మాత్రమే. ఏడు తులాల బంగారు నగలను మా కొత్త ఇంటి నిర్మాణానికి గ్రామీణ బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాను. ఇంటి నిర్మాణ పనుల్లో ఒకరికి ఇవ్వాల్సిన రూ. 50 వేలను ఇచ్చేశాను. కానీ చోరీ జరిగింది కాబట్టి, ఇదే అదునుగా బంగారు నగలు, నగదు పోయిందని ఫిర్యాదు చేస్తే రికవరీలో లాభం జరుగుతుందని దురుద్ధేశంతోనే తప్పుడు ఫిర్యాదు చేశాను.’ అని వనత పోలీసుల ముందు అంగీకరించారు.
అంతే… పోలీసులు అవాక్కయ్యారు. కట్టుకథ చెప్పి, తప్పుడు ఫిర్యాదు చేసి, పోలీసులను తప్పుదోవ పట్టించి టైమ్ వేస్ట్ చేసినందుకు వనితపైన కూడా సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు దొంగలతోపాటు వనిత కూడా ఈ చోరీ ఘటన నేపథ్యంలో నిందితురాలిగా మారాల్సి వచ్చింది. ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు చేసే వారిని ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ పి. రవీందర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.