కరోనా వైరస్ సోకి మరణించిన వారి దహనానికి ప్రత్యేకంగా శ్మశాన వాటికల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని వరంగల్ మహా నగర పాలక సంస్థ (GWMC) కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో కమిషనర్ మాట్లాడారు.
వరంగల్ నగరంలో కరోనా వైరస్ తో చనిపోయిన వారిని సాధారణంగా వారి స్మశాన వాటికలలో దహనం చేయడానికి ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ దృష్ట్యా వెంటనే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల కొరకు వేర్వేరుగా ప్రత్యేక స్థలాలను గుర్తించాలన్నారు.
మృతదేహాలను స్మశాన వాటికలకు తరలించడానికి అంబులెన్సును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాల దహనం కొరకు వారి సంబంధికులను సహకరించుటకు డి ఆర్ ఎఫ్ నుండి నుండి ఇద్దరు సిబ్బంది, ఇద్దరు జవాన్లను కేటాయించామని చెప్పారు.
ఉద్యోగులకు గెస్ట్ హౌస్ లో హోం క్వారంటైన్:
బల్దియాలో కరోనాతో బాధపడుతున్న కింది స్థాయి ఉద్యోగులకు హోమ్ క్వారంటైన్ కోసం మునిసిపల్ అతిధి గృహాన్ని, హన్మకొండ మచిలీబజార్ లోని కమ్యూనిటీ హాళ్లను వెంటనే సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆవసరమైతే వారికి బల్దియా ఆధ్వర్యంలో భోజనం కల్పించనున్నట్లు కమిషనర్ తెలిపారు.