ఫొటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు అన్నం శ్రీనివాసరావు. సామాజిక సంఘ సేవకుడు. అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూడా. ఎంతో మంది అనాథలను, వికలాంగులను అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పిస్తుంటారు. ఈయన ఆశ్రమంలో దాదాపు 330 మంది అనాథలు, వికలాంగులు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ఇటువంటి అనాథలకు ఆయన పెద్ద దిక్కుగా ప్రాచుర్యం పొందారు. దాతల సహకారంతో శ్రీనివాసరావు దిక్కూ, మొక్కూలేని వారి ఆకలిని తీరుస్తుంటారు.
కరోనా కల్లోల పరిణామాల్లోనూ అన్నం శ్రీనివాసరావు తన సేవలను విస్మరించకపోగా విస్తరించారు. కరోనా బారిన పడిన చనిపోయిన దాదాపు 30 మందికి దగ్గరుండి మరీ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం శ్రీనివాసరావు కూడా కరోనా బారిన పడ్డారు. వైరస్ సోకిన ఆయనను అధికారులు ఖమ్మం శివార్లలోని మద్దులపల్లి క్వారంటైన్ కేంద్రంలో చేర్చారు. అక్కడ కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను, అక్కడి పరిశుభ్రత పరిస్థితులను చూసి అన్నం శ్రీనివాసరావు ఆందోళన చెందారు.
అక్కడి నుంచి బయటకు వచ్చి తనకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారగణాన్ని అర్థిస్తున్నారు. మీడియాకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఎంతో మంది అనాథలకు సాయం చేసిన చేతులు ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడాలంటూ ప్రార్ధిస్తున్న తీరు కరోనా సేవల దయనీయ స్థితికి అద్దం పడుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇందుకు సంబంధించి హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వార్తా కథనాన్ని దిగువన గల లింక్ లో చూడండి.