తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా ఇది బ్రేకింగ్ న్యూసే. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. వెంటనే తనను కలవాలని కేసీఆర్ కొద్ది రోజుల క్రితమే తుమ్మలను ఫోన్ ద్వారా కోరినట్లు ఆయన అనుచరగణం సైతం ధృవీకరిస్తోంది. అయితే రాజకీయంగా తన ఎదుగుదలలో ముహూర్తాలను కూడా బలంగా విశ్వసించే తుమ్మల నాలుగు రోజులు ఆగాక వచ్చి కలుస్తానని సీఎం కేసీఆర్ ను అభ్యర్థించినట్లు ప్రచారపు సారాంశం.
ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా, మంత్రి హోదాలో తుమ్మల నాగేశ్వరరావు అనూహ్యంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అంతకు ముందు 2014 ఎన్నికల్లోనూ తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేసి ఓటమి చెందగా, తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ తో గల సాన్నిహిత్యం తుమ్మలను మరోసారి రాజీకీయంగా లైమ్ లైట్ లోకి తీసుకువచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఇందులో భాగంగానే 2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఆర్ఎస్ లో చేరడం, మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం చకచకా జరిగిపోయాయి. అనంతర పరిణామాల్లో పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నది వేరే విషయం. కానీ గత ఎన్నికల్లో తుమ్మల ఓటమికి అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు తీవ్రంగా పాటుపడ్డారనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి.
తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం సత్తుపల్లి సమీపంలోని తన స్వగ్రామమైన గండుగులపల్లిలోనే ఎక్కువగా ఉంటున్నారు. వ్యవసాయ పనులను తనే స్వయంగా చూసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే సీఎం కేసీఆర్ నుంచి తుమ్మల నాగేశ్వరరావుకు పిలుపు వచ్చిందనేది తాజా వార్త.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు నేపథ్యంలో తుమ్మలకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిందనే అంశానికి సహజంగానే రాజకీయ ప్రాధాన్యత ఏర్పడిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పలు సమీకరణలను బేరీజు వేసి తుమ్మలకు కేసీఆర్ మరోసారి ప్రాధాన్యతను ఇచ్చే విషయాన్ని తోసిపుచ్చలేమని కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, కేసీఆర్ నిర్ణయాలు సంచలనానికి దారి తీసే పరిణామాలు కూడా ఉండవచ్చని ఆ వర్గాలు అంచనా వేస్తుండడం గమనార్హం.