కరోనా మరణాలపై తెలంగాణా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సోకినవారు భయంతోనే చాలా మంది చనిపోతున్నారని ఆయన అన్నారు. BRKR భవన్ నుండి తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న హాస్పిటల్ సూపరింటెడెంట్లతో , సిబ్బందితో మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా రిసెర్చ్ చేస్తున్న వారితో చర్చలు జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు అధునాతన ట్రీట్మెంట్ సమాచారం అందిస్తామన్నారు. వాక్సిన్ వచ్చినా దాని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని మేధావులు చెప్తున్నారన్నారు. వ్యాధి సోకిన 99 శాతం మందిలో వెంటిలేటర్, రెమెడిస్వర్ లాంటి మందులు అవసరం లేదన్నారు. యాంటీ ఇన్ఫ్లమాటొరి మందులు సకాలంలో ఉపయోగించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని మంత్రి చెప్పారు.
కరోన వ్యాధిని ముందుగా గుర్తిద్దామని, చావులను అరికడదామని పిలుపునిచ్చారు. చాలామందికి కరోనా ఉన్నా కూడా తెలియడంలేదని, ప్రజలకు ధైర్యం కలిపించడం మన ముందున్న లక్ష్యమని, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని, అందరం అదే స్పూర్తి తో పని చేద్దామని ఈటెల కోరారు. ప్రతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పూర్తి సామర్ధ్యంతో పనిచేయాలని, ప్రతి పేషంటును హాస్పిటల్ కి రాగానే అడ్మిట్ చేసుకోవాలన్నారు. స్టెబిలైజ్ చేసిన తరువాతనే పెద్ద ఆసుపత్రులకు పంపించాలని,
95 శాతం మంది పేషంట్ల కు ఎలాంటి సమస్య ఉండదని, మిగతా 5 శాతం మంది కోసమే మనం కష్టపడాలన్నారు.
అవసరమైన సిబ్బందిని నియామకం చేసుకోవాలని, ఆసుపత్రులకు గల అన్ని అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. డైట్ కాంట్రాక్టర్స్ బకాయిలన్నీ విడుదల చేస్తామన్నారు. కరోనా రోగులకు పౌష్టికాహారం అందించాలని కోరారు. అన్ని జిల్లాల్లో ఐసొలేషన్ సెంటర్లను ప్రారంభించాలని సూచించారు. అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలెండర్లను ఇక్కడి నుండే పంపిస్తామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వే, DME రమేష్ రెడ్డి, VC కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.