ఆర్టీసీ ఉమెన్ బయో-టాయిలెట్ల బస్సుల ‘రంగు’ తెలంగాణాలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచనలను సీఎం కేసీఆర్ తిరస్కరించారా? ఈ బస్సుల రంగుపై నిన్న, ఈరోజు చోటు చేసుకున్న పరిణామాలు ఇదే సందేహాన్ని కలిగిస్తున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తరపున నిర్వహిస్తున్న ‘మినిస్టర్ పువ్వాడ ఇన్ఫో-112’ వాట్సాప్ గ్రూపులో నిన్న అధికారికంగా జారీ చేసిన కింది ప్రకటనను నిశితంగా పరిశీలించండి. ఇది చదివాక అసలు విషయంలోకి వెడదాం…
Khammam/22.7.2020
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
For Scroll;
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉమెన్ బయో-టాయిలెట్స్ బస్సులు గులాబీ రంగులోనే ఉండాలని పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు గారి సూచనల మేరకు బస్సుల రంగు మార్చడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా బస్సులను బుధవారం SR&BGNR కళాశాల మైదానంలో అందుబాటులో ఉంచారు. మంత్రి కేటీఆర్ గారి సూచనలతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బయో-టాయిలెట్ బస్సులు యూనిఫార్మల్ గా గులాబీ రంగులోనే ఉండనున్నాయని మీడియాకు వివరించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘టాయిలెట్ ఆన్ వీల్స్’ ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ గారు, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ గారు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారు ఉన్నారు.
చవివారు కదా…? మంత్రి కేటీఆర్ సూచనల మేరకు బయో టాయిలెట్ల బస్సుల రంగు మారుస్తున్నట్లు వెలువడిన ప్రకటన ఇది. ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే… మహిళల బయో టాయిలెట్ల బస్సులకు గులాబీ రంగు వేయడాన్ని నిలిపివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు హెచ్ఎంటీవీ న్యూస్ బ్రేక్ చేసింది. బయో టాయిలెట్ల బస్సులకు ఏ రంగు వేయాలనేది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పినట్లు కూడా హెచ్ఎంటీవీ తన తాజా కథనంలో నివేదించడం గమనార్హం. తొలుత గ్రీన్ కలర్… ఆ తర్వాత మంత్రి కేటీఆర్ సూచన మేరకు ‘గులాబీ’ కలర్… తాజాగా ఏ రంగు వేయాలనే అంశంపై త్వరలోనే నిర్ణయం… ఇదీ బయోటాయ్ లెట్ బస్సుల రంగుపై జరుగుతున్న చర్చ. కాగా…
ఆర్టీసీ కార్గో బస్సులపై సీఎం కేసీఆర్ ఫొటో అంశంలోనూ గతంలో జరిగిన ప్రచారం వివాదాస్పదమైంది. సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరిగిందని, అయితే ఈ ప్రయత్నాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు పట్టినట్లు అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యమని ముఖ్యమంత్రి అప్పట్లో అన్నారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఈ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.