ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కరోనాకు తర, తమ, వయో భేదాలు, హోదాలతో సంబంధం లేకపోయినప్పటికీ, వైరస్ బారిన పడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. ఈ పరిణామం సహజంగానే ఆయా నాయకుల అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణాలో హోం మంత్రి మహమూద్ ఆలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, గణేష్ గుప్తాలు ఇప్పటికే కరోనా బారినపడి కోలుకోగా, హుస్నాబాద్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు వి. సతీష్ కుమార్, వివేకానందగౌడ్, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశరావు దంపతులకు కరోనా సోకడంతో వారు చికిత్స తీసుకుంటున్నారు. కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలు కూడా కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కూడా బుధవారం కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన కూడా చికిత్సకోసం ఆసుపత్రికి తరలివెళ్లారు.
ఇక పొరుగున గల ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి బుధవారం కరోనా సోకింది. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతోపాటు ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసులు, కిలివేటి సంజీవయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి, అన్నాబత్తిన శివకుమార్, కిలారి రోశయ్య తదితరులు కరోనా బారినపడ్డారు.