చుట్టూ అందమైన కొండలు, పచ్చని చెట్లు, పంట పొలాలు, చూడ చక్కని పల్లెలు, మంచి మనస్సున్న ఆదివాసీ గిరిజన ప్రజలు నివసించే మండలం. ఖమ్మం జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మండల కేంద్రంలో 19 మందితో ఉన్న ఒక ఉమ్మడి కుటుంబంలో 16 మందికి, వారి డ్రైవర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అటవీ గ్రామాలు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాయి. హైదరాబాద్ మహా నగరంలోనే ఇంత కాలం కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అనుకున్నాము. కానీ మారుమూల గ్రామంలో, అదికూడా ఒకే కుటుంబంలో 16 పాజిటివ్ కేసులు నమోదు కావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
గుండాల మండల కేంద్రంలో గుండుపిన్ను దగ్గర నుంచి ఎంతపెద్ద వస్తువు కావాలన్నా అందించే సామర్థ్యం ఉన్న ఓ వ్యాపారవేత్త కుటుంబంలో ఈ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అందరూ హైదరాబాద్ ప్రైవేట్ వైద్య శాలలో చికిత్స పొందుతున్నారు. చిన్న పిల్లల్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ళు, కొందరు షుగర్, బిపి పేషెంట్ లు కూడా ఉన్నారు. అందరూ క్షేమంగా ఉన్నారని, త్వరలోనే కోలుకుని తిరిగి వస్తారని వారి దగ్గరి బంధువు ఒకరు చెప్పారు.
కాగా ఒకే కుటుంబంలో 16 మందికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు గుండాల మండల కేంద్రాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ప్రజలు నిత్యావసర వస్తువులకు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
✍ తుమ్మలపల్లి ప్రసాద్