కోవిడ్ 19 కరోనా తీవ్రత దృష్ట్యా .. రేపు. అనగా 20.07.2020 రోజునుండి కాళేశ్వరం త్రివేణి సంగమంలో శ్రాద్ధ కర్మలు నిషేధించనైనది.
బ్రాహ్మణ సంఘం.
కాళేశ్వరం
చూశారుగా…? కాళేశ్వరం బ్రాహ్మణ సంఘం విడుదల చేసిన వాట్సాప్ సందేశమిది. కరోనా చావులపై దయనీయ కథనాల గురించి వింటున్నాం, చదువుతున్నాం. హృదయ విదారక వీడియోలను కూడా చూస్తున్నాం. కానీ తాజాగా మరో అనూహ్య పరిణామం ఎదురైంది. కరోనా కబళించినవారి శ్రాద్ద కర్మలకూ నిషేధం చిక్కొచ్చిపడింది.
విషయమేమిటంటే… వివిధ కారణాలవల్లే కాదు, కరోనా బారినపడి మరణించినవారి ఆత్మశాంతి కోసం, హిందూ ఆచార, సంప్రదాయాల ప్రకారం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద గోదావరినదిలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తుంటారు. అయితే కరోనా కల్లోల పరిణామాలు స్థానిక బ్రాహ్మణులను తీవ్రంగా వణికిస్తున్నాయి. శ్రాద్ధ కర్మల నిర్వహణ పేరుతో వస్తున్నవారి సంఖ్యను వారు చూసి భీతావహానికి గురవుతున్నారు.
ఎందుకంటే… శ్రాద్ధ కర్మల పేరుతో పలు ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు కరోనా పరిస్థితులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదుట. ఓ మేకను లేదా గొర్రెను వాహనంలో వేసుకుని, మద్యం బాటిళ్లను కూడా వెంట తీసుకుని, మందీ మార్బలంతో కాళేశ్వరంలో గుంపులు గుంపులుగా దిగుతున్నారట. చనిపోయిన ఒక్కరికి శ్రాద్ధ కర్మలు నిర్వహించేందుకు కనీసంగా 30 మంది వస్తున్నారట.
ఇన్నిరోజులపాటు పోలీసులు కాస్త కంట్రోల్ చేశారని, ప్రస్తుతం వాళ్లు కూడా చేతులెత్తేసే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని స్థానిక బ్రాహ్మణులు చెబుతున్నారు. అందుకే శ్రాద్ధ కర్మలపై తాత్కాలికంగా ‘నిషేధం’ విధించినట్లు చెబుతున్నారు. హతవిధీ… చివరికి చచ్చినవారి శ్రాద్ధ కర్మలకూ తాత్కాలికంగా దిక్కు లేదన్నమాట.