తెలంగాణాలో కరోనా వైరస్ సోకినవారి లెక్కల విషయంలో ప్రజల్లో ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ లెక్కల్లోని బొక్కలకు సంబంధించి అధికార, విపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం కూడా జరుగుతూనే ఉంది. ఒక్కోసారి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ చెప్పే లెక్కలకు, అదే శాఖకు చెందిన జిల్లా అధికార విభాగం ఇచ్చే నివేదికలకు అస్సలు పొంతన కుదరదు. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది కూడా. ఇందుకు కారణాలు ఏవైనా కావచ్చు.
Please click on below links to follow us in social media
కానీ కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు అనుబంధంగా పనిచేసే ఇంటగ్రిటీ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీపీఎస్) శుక్రవారం జారీ చేసిన కరోనా పాజిటివ్ పేషెంట్ల నివేదికను ఓసారి నిశితంగా పరిశీలించండి. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో కరోనా సోకినవారి వివరాలివి. ఈ జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఒకరికి కరోనా సోకినట్లు ఐడీపీఎస్ అధికారులు నివేదించారు. సాక్షాత్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ జిల్లాలోనే ఇటువంటి నివేదిక రావడం గమనార్హం.
అదేమిటి…? పొరుగున గల ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం కరీంనగర్ నగరంలోకి ఎలా వచ్చిందని మాత్రం ఆశ్చర్యపోకండి. అయినా శ్రీకాకుళం అనే పేరు కరీంనగర్ లో ఏదైనా వీధికి ఉండొద్దని రూలుందా? అని సందేహించాల్సిన అవసరమే లేదు. కరీం‘నగరం’లో శ్రీకాకుళం అనే పేరుతో వీధి కాదు కదా… చిన్న సందు కూడా లేదట. అందులోనూ నివేదికలో ‘శ్రీకాకుళం డిస్ట్రిక్ట్’ అని వివరంగానే రాశారు మరి. అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే… ఇవేం లెక్కలు? శ్రీకాకుళం జిల్లా కరీంనగర్ లో ఉండడమేమిటి? అని మాత్రం ప్రశ్నించకండి. ఎందుకంటే… ప్రశ్నిస్తే అదేదో విపత్తుల ‘యాక్టు’ కింద మిమ్మల్ని బుక్ చేసినా ఆశ్చర్యం లేకపోవచ్చు.