ఖమ్మం నగరంలో వ్యాపార కేంద్రంగా ప్రాచుర్యం పొందిన గాంధీ చౌక్ ఏరియా కరోనా కోరల్లో చిక్కుకుంది. నగరానికి చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారులు దేవత నాగప్రసాద్, నేరెళ్ల నారాయణరావు కరోనా సోకి మరణించిన ఉదంతం గాంధీ చౌక్ ప్రాంత వ్యాపార వర్గాల్లో తీరని విషాదాన్ని నింపింది.
ఈ ఇద్దరు ప్రముఖ వ్యాపారుల మరణవార్తను ts29 ప్రచురించిన కొద్ది సేపటికే నగరానికి చెందిన ఓ వాహన షోరూం అధిపతి, వ్యాపార ప్రముఖుడు స్పందించి పంపిన ‘మెసేజ్’ను కూడా ఇక్కడ చూడవచ్చు. మరణించిన ఇద్దరు ప్రముఖ వ్యాపారుల్లో ఒకరు మాత్రమే వివాహానికి హాజరయ్యారని, మరొకరికి కమ్యూనిటీ వ్యాప్తి ద్వారా వైరస్ సోకిందని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ చౌక్ ప్రస్తుతం భయాందోళనలో ఉందని, మరో ఇద్దరు వ్యాపారులు కూడా చికిత్స తీసుకుంటున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.
ఔను… ఆయా వ్యాపార ప్రముఖుడు చెప్పిన మాట వాస్తవమే. ఖమ్మం గాంధీ చౌక్ ప్రస్తుతం గజగజ వణుకుతోంది. నగరం యావత్తే కాదు, దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇక్కడి నుంచే హోల్ సేల్ వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారులు కరోనా సోకి మరణించడంతో నగరంలోని చిన్నా, చితకా వ్యాపారులే కాదు, సామాన్య ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
వ్యాపార వర్గానికి చెందిన సుమారు మరో 10-15 మంది వరకు కూడా కరోనా బారిన పడి హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కొందరు తమ రంగానికే చెందిన ప్రముఖులు కూడా ఉన్నట్లు వ్యాపార వర్గాలే వెల్లడిస్తున్నాయి.
అయితే శుక్రవారం రాత్రి మరణించిన ఇద్దరు వ్యాపార ప్రముఖులైన దేవత నాగప్రసాద్, నేరెళ్ల నారాయణరావులు స్థానిక వైద్య వర్గాల కరోనా పేషెంట్ల గణాంకాల్లో లేరంటున్నారు. రాజధాని కేంద్రంలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతున్న మరో 10-15 మంది కూడా నేరుగా అక్కడికే వెళ్లారని, స్థానికంగా వారికి సంబంధించిన కరోనా పేషెంట్ల లెక్కలు లేవనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా కరోనా కోరల్లో చిక్కుకుని ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతం విలవిలలాడుతోందని చెప్పక తప్పదు.