ఖమ్మం నగరంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా బారిన పడి ఖమ్మం నగరానికి చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారులు మృతి చెందారు. దీంతో ఖమ్మం గాంధీచౌక్ లోని వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఖమ్మం కిరాణా జాగిరి మర్చంట్స్ అసోసియేషన్ సభ్యుడు నేరెళ్ల నారాయణ, నగర ఆర్యవైశ్య ప్రముఖుడు, ఆడ్తి వ్యాపారి దేవత నాగప్రసాద్ లు కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడినట్లు తెలిసింది. హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటూనే శుక్రవారం రాత్రి వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారని గాంధీ చౌక్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
సుమారు ఇరవై రోజుల క్రితం కొత్తగూడెం పట్టణంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వీరిద్దరూ హాజరైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అదే పెళ్లికి హైదరాబాద్ నుంచి కూడా కొందరు వచ్చారని, వారి నుంచే ఖమ్మానికి చెందిన ఈ ఇద్దరు వ్యాపార ప్రముఖులకు కరోనా సోకి ఉంటుందని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి.