అలలు అలలుగా పడిలేచిన వాళ్లం
అవిశ్రాంతంగా పరుగు పెట్టిన వాళ్లం
కాల ప్రవాహాన్ని నీడలా అనుసరించిన వాళ్లం
మూర్త, అమూర్త ఘటనలకు సాక్షీభూతంగా నిలిచిన వాళ్లం
సమస్త లోకరీతిని అక్షరంగా మలిచి విసిరేసిన వాళ్లం
–ఇప్పుడు నిస్సత్తువగా..
అక్రమార్కుల గుండెల్లో నిదురించిన వాళ్లం
అభాగ్యుల కన్నీళ్లకు ఓదార్పునిచ్చిన వాళ్లం
దిక్కులేని జనానికి గొంతుకై మార్మోగిన వాళ్లం
జన పోరాటాలకు ఊపిరిలూదిన వాళ్లం
రహసోద్యమాలకు వెనుదన్నుగా నిలిచిన వాళ్లం
–ఇప్పుడు అశక్తతతో…
ప్రతిభకు పట్టం కట్టిన వాళ్లం
విజయాలకు జయ జయ ధ్వానాలు పలికిన వాళ్లం
పండుగలకు, పబ్బాలకు రంగుల హంగులను అద్దిన వాళ్లం
జనజాతరలను దిగంతాలకు చాటిచెప్పిన వాళ్లం
పీడిత జనానికి మంచిరోజులను కలగన్న వాళ్లం
–ఇప్పుడు దిక్కులు తెలియని స్థితిలో…
పాలకులను ప్రశ్నించిన వాళ్లం
దారి తప్పినప్పుడు హితవులు చెప్పిన వాళ్లం
జల విజయాలను కీర్తించిన వాళ్లం
సంక్షేమ పాలనకు సెల్యూట్ కొట్టిన వాళ్లం
ప్రజకు, ప్రభుతకు మధ్య వారధిగా వ్యవహరించిన వాళ్లం
–ఇప్పుడు చిమ్మచీకటి మధ్యన..
ఒక సమరోత్సాహం…
ఒక ధిక్కారం…
ఒక యజ్ఞం…
ఇప్పుడొక చరిత్ర!
విధి విసిరిన వలలో
పాత్రికేయం ఇప్పుడు బంధనాలు లేని బందీ!
హే.. భగవాన్
కుచ్ కరోనా!
✍️ శంకర్ శెంకేసి
(79898 76088)