మీడియా ప్రతినిధులను కరోనా చుట్టుముట్టడం కొత్త వార్త కాకపోవచ్చు. ఓ ఛానల్ కు చెందిన జర్నలిస్టు ఒకరు ఇప్పటికే మృత్యువాత పడగా, అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. మరికొందరు కోలుకున్నారు కూడా. కానీ తెలుగు మీడియాలోని ఓ ప్రముఖ ఛానల్ ను కరోనా చుట్టుముట్టడమే తాజా వార్త. దీంతో ఆయా సంస్థలకు చెందిన ఉద్యోగులు కలవరపడుతున్నారు.
ఆయా ఛానల్ లో అత్యున్నత స్థాయిలో పనిచేసే ఓ జర్నలిస్టు కమ్ యాంకర్ గడచిన రెండు, మూడు రోజులుగా ఎటువంటి డిబేట్లు నిర్వహించడం లేదు. ఆయన స్థానంలో మరో జర్నలిస్టు డిబేట్ ను నెట్టుకొస్తున్నారు. ఇదే ఛానల్ లో పనిచేసే కొందరు ఔట్ పుట్ ఎడిటర్ స్థాయి ఉద్యోగులకు కూడా కరోనా సోకినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఛానల్లో పనిచేసే ఆరుగురు ముఖ్య ఉద్యోగులను ప్రత్యేకంగా ఓ చోట క్వారంటైన్ చేసినట్లు తెలిసింది. నేచర్ క్యూర్ ఆసుపత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం ఆయా ప్రముఖ ఛానల్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.