‘హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరం. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువున్న క్రమంలో హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఉండడం సహజం. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల కదలిక పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్ డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి. హైదారాబాద్ లో కూడా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి.’
గుర్తుంది కదా? తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు గత ఆదివారం నిర్వహించిన ఉన్నతస్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో తెలంగాణా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలోని ఓ ముఖ్యాంశమిది. లాక్ డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుందని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుందని కూడా సీఎం చెప్పారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని, కేబినెట్ ను సమావేశ పరచాలని, అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా సీఎం వెల్లడించారు.
ఇదిగో ఈ ప్రకటన తర్వాత హైదరాబాద్ నగరంలోని పలు వర్గాలు పల్లెల బాట పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సంఘటిత రంగంలోని కార్మికులు గత అనుభవాల నేపథ్యంలో తిరిగి జిల్లాలకు పయనమవుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో కరోనా తీవ్రతరమైన పరిస్థితుల్లో, మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వార్తల కారణంగా పలు వర్గాల ప్రజలు తమ సొంత జిల్లాలకు వెళ్లేందుకు సంసిద్దమవుతున్నారట.
ఈ పరిణామం వైరస్ వ్యాప్తికి మరింత ప్రమాదకర పరిణామంగా పలువురు అంచనా వేస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత, ఖమ్మం నగరానికి చెందిన మున్సిపల్ కార్పొరేటర్ వడ్డెబోయిన నరసింహారావు విశ్లేషణ ప్రకారం… రాజధానిలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో పలు వర్గాల ప్రజలు జిల్లాలకు తిరిగి వస్తున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోకపోతే తెలంగాణా వ్యాప్తంగా కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశముంది.
అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి జిల్లాలకు వచ్చేవారికి కరోనా టెస్టులు నిర్వహించి, నిర్దేశిత గడువు ప్రకారం వారిని క్వారంటైన్లో ఉంచాల్సి ఉంటుంది. లేనిపక్షంలో జిల్లాలు కూడా హైదరాబాద్ తరహాలోనే కరోనా వ్యాప్తికి దారి తీయవచ్చు. అప్పుడు పరిస్థితి చేయిదాటినా ఆశ్యర్చం లేదు. జిల్లా కలెక్టర్లకు ఈ అంశంలో ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది.