ఆయ్…? మా పార్టీ కార్యకర్త సర్కారు స్థలాన్ని కబ్జా చేస్తే చర్య తీసుకుంటావా? మా కులం వాడని తెలిసీ అక్రమ కట్టడాన్ని కూల్చేస్తావా? మా ఊరివాళ్లను నీ అధికార దర్పంతో ముప్పు తిప్పలు పెడతావా? ఉద్యోగం చేయాలని ఉందా? లేదా? శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం… ఏమనుకుంటున్నావో… నీ సంగతి చెబుతాం? నీ అంతు తేలుస్తాం? నిన్ను సస్పెండ్ చేయిస్తాం? అయినా వినకపోతే నీ ఉద్యోగం కూడా పీకేయిస్తాం? వర్తమాన రాజకీయాల్లో ఇటువంటి ఘటనలు అనేకం చూస్తున్నాం కదా? రాజకీయాలు, అధికారం సామాజిక వర్గాల పెత్తనంగా మారినట్లు అనేక ఉదంతాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో వందేళ్ల జయంత్యుత్సవాలు ఏడాది పొడవునా నిర్వహణకు నోచుకున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఇటువంటి సందర్బాల్లో ఎలా వ్యవహరించేవారో తెలిస్తే ఆయన చతురతకు, సమయస్ఫూర్తికి జయహో… అనక తప్పదు. అటువంటిదే ఈ ఘటన.
శాలినీ మిశ్రా గుర్తున్నారు కదా? ఐఏఎస్ అధికారి. 1994-95 ప్రాంతంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆమె ధాటికి వరంగల్ వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ స్టార్ట్ చేస్తుందో, మరెక్కడ ముగిస్తుందో కూడా తెలియని పరిస్థితి. శాలినీ మిశ్రా చెప్పింది చేయడం తప్ప, ఆమెకు ఎదురుచెప్పే సాహసం అధికారవర్గాల్లో ఎవరికీ ఉండేది కాదు.
శుక్రవారం సాయంత్రం పొక్లెయిన్లు, డోజర్లను, తన కింది స్థాయి అధికారగణాన్ని వెంటేసుకుని ఆమె బయలుదేరేవారు. వరంగల్ చౌరాస్తా, హన్మకొండ చౌరాస్తా, నక్కల గుట్ట, మండిబజార్, బట్టలబజార్, కాకతీయ టాకీస్ ఏరియా ఎక్కడైనా సరే… పొక్లెయిన్లు, డోజర్లు వాలిపోవచ్చు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న కట్టడాలు… అంటే భవనాలు కావచ్చు, ఇంద్ర భవనాలు కావచ్చు, పెంకుటిళ్లు కావచ్చు. కూల్చాల్సిందే, అవి కుప్పకూలిపోవలసిందే.శుక్రవారం సాయంత్రం మొదలైన కూల్చివేతల ప్రక్రియ సోమవారం ఉదయం పది గంటల వరకు కొనసాగాల్సిందే. ప్రతి వారాంతంలో వరంగల్ నగరంలో రోడ్లకు ఇరువైపులా కొనసాగిన భవనాల విధ్వంసపు ప్రక్రియ ఇది. వ్యాపార వర్గాల గగ్గోలు. ఒకటే గోల. తమను ఆదుకునేవారి కోసం ఎదురుచూపులు. ఎమ్మెల్యేలే కాదు చివరికి మంత్రులు కూడా శాలినీ మిశ్రాకు ఎదురుచెప్పేందుకు సాహసించేవారు కాదు. ప్రయత్నించినవారికి ఎటువంటి పరాభవం ఎదురైందో అప్పటి నాయకుల్లో చాలా మందికి తెలుసు. అందుకే శాలినామీ మిశ్రా అంటేనే రాజకీయ నాయకులు వెనుకంజ వేసేవారు. మరి ఎలా? ఈ విధ్యంసాన్ని అడ్డుకునేదెవరు? ఆపేదెవరు?
గత్యంతరం లేదు. వ్యాపారులు సుదీర్ఘ మంతనాలు చేశారు. ఓ నిర్ణయానికి వచ్చేశారు. మన పీవీ ఢిల్లీ పీఠాన్ని ఏలుతున్నారు కదా? మన కాకతీయ గడ్డ బిడ్డడే కదా? మన బాధలేవో నేరుగా ఆయనకే చెబుదామని వరంగల్ నగరానికి చెందిన వ్యాపారులు నిర్ణయించుకున్నారు. అపాయింట్మెంట్ కోరారు. జన్మనిచ్చిన జిల్లాకు చెందినవారు కావడంతో వ్యాపారులకు పీవీ అపాయింట్మెంట్ అత్యంత వేగంగానే దొరికింది. ఎగిరి గంతేసినంత సంతోషంతో దాదాపు డజను మంది ప్రముఖ వ్యాపారులు ఢిల్లీకి బయలుదేరారు. వీళ్లు ఢిల్లీకి చేరిందే తడవుగా ప్రధాని పీవీ కార్యాలయ వర్గాలు విమనాశ్రయం నుంచే రాచమర్యాదలు చేశాయి. సకల వసతి సౌకర్యాలను కల్పించాయి. ఉదయాన్నే కాఫీలు, టీలు చేశాక ప్రధాని పీవీ వ్యాపారుల వద్దకు వచ్చి పలకరించారు. కుశల ప్రశ్నలు ముగిశాక, వ్యాపారులు ఏదో మాట్లాడబోయారు. ‘ముందు మీరు ఢిల్లీ చూసి రండి. సాయంత్రం ప్రశాంతంగా అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడుకుందామని పీవీ వ్యాపార ప్రముఖులకు చెప్పి తన విధుల్లో నిమగ్నమయ్యారు.
ప్రధాని కార్యాయలం అధికారికంగానే ఏర్పాటు చేసిన ఏసీ కార్లలో ఢిల్లీ మొత్తం కలియదిరిగిన వరంగల్ వ్యాపార దిగ్గజాలు సాయంత్రానికి మళ్లీ పీవీని కలిసేందుకు సన్నద్ధమయ్యారు. సంధ్యవేళ నమస్కార, ప్రతి నమస్కారాలు ముగిశాక, ‘ఎలా ఉంది ఢిల్లీ…?’ అని పీవీ వ్యాపారులను ప్రశ్నించారు. ‘అబ్బో అద్భుతం సర్… హస్తినాపురం. చాలా అందంగా ఉంది. రోడ్లు భలే విశాలంగా ఉన్నాయ్ సర్.’ అని వ్యాపారులు చెప్పారు. ‘బాగుంది కదా ఢిల్లీ? మన వరంగల్ రోడ్లు కూడా అలా తయారు కావాలి. అది నా కోరిక కూడా. ఓకేనా? అందరూ భోజనం చేసి వెళ్లండి. మన వరంగల్ ప్రజలను నేను అడిగినట్లు చెప్పండి’ అని పీవీ అనగానే వ్యాపారుల నోట మాట రాలేదు. ఢిల్లీ వరకు వచ్చిన పనేమిటో చెప్పకుండానే మరోసారి పీవీ సాబ్ కు ‘దండం’ పెట్టి బిక్క మొహంతో కాకతీయ నగరానికి తిరుగుముఖం పట్టారు వ్యాపారులు.
ఇంతకీ వరంగల్ వ్యాపారులు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో, ప్రధాని పీవీని ఎందుకు కలిశారో తెలుసా? అప్పటి మున్సిపల్ కమిషనర్ శాలినీ మిశ్రాపై ఫిర్యాదు చేసి, ఆమెను అక్కడి నుంచి పంపించేందుకు స్కెచ్ వేశారన్నమాట. ఎవరు ఎందుకు వస్తున్నారో ఇంటలిజెన్స్ సమాచారం లేకుండానే ప్రధాని అపాయింట్మెంట్ లభిస్తుందేమిటి? తమ వరంగల్ వాళ్లు ఎందుకు వస్తున్నారు? ఏ పని కోసం ఇంత దూరం బయలుదేరారు? అనే ప్రశ్నలకు సమాధానం సేకరించాకే వ్యాపారులకు ప్రధాని అపాయింట్మెంట్ లభించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ముందే చదివారు కదా? దటీజ్ ప్రైమ్ మినిస్టర్ పీవీ సాబ్.
వరంగల్ మహానగరంలోని రోడ్లు ఇప్పుడు ఈమాత్రం విశాలంగా ఉన్నాయంటే, బట్టలబజార్ వంటి ఇరుకు గల్లీలు సైతం విస్తరణకు నోచుకున్నాయంటే శాలినీమిశ్రా వంటి అధికారుల పట్టుదలే ప్రధాన కారణం. అటువంటి అధికారులను కాపాడుకునే పీవీ వంటి పాలకులూ ప్రజలకు ఎప్పుడూ అవసరమే.
ఆ సమయంలో నేను ‘ఆంధ్రప్రభ’ పత్రికకు వరంగల్ కేంద్రంగా పాత్రికేయునిగా పనిచేస్తున్నాను. శాలినీ మిశ్రా పనితీరుపై అప్పట్లో సీరియల్ కథనాలు రాశాను. కూల్చివేతలపై వరంగల్ వ్యాపారుల ఢిల్లీ పర్యటన గురించి ప్రజలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పకుంటుంటారు.
✍️ ఎడమ సమ్మిరెడ్డి