దాదాపు 300 మంది సాయుధుల భద్రతా పహరా మధ్య… పది వేల మంది ప్రజలతో నిషేధిత మావోయిస్టు నక్సల్స్ భారీ సమావేశాన్ని నిర్వహించారా? తెలంగాణా సరిహద్దుల్లోని ఛత్తీస్ గఢ్ అడవుల్లో జరిగిన ఈ సమావేశంలో నక్సల్స్ ఆటా, పాటా కార్యక్రమాలను మూడు రోజులపాటు నిరాటంకంగా కొనసాగించారా? సుమారు అరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించిన పార్టీ అగ్రనేత రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ వారసునిపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగిందా? ఔననే సారాంశంతో ‘హిందుస్తాన్ టైమ్స్’ ప్రచురించిన ఓ భారీ వార్తా కథనం సంచలనం కలిగిస్తోంది. దీంతో పోలీసు వర్గాలు సమాచార సేకరణలో నిమగ్నమయ్యాయి. అటు ఛత్తీస్ గఢ్, ఇటు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ఇంటలిజెన్స్ విభాగాలు సైతం ఈ సమావేశపు వివరాలను మరింత లోతుగా సేకరించే పనిలో పడ్డాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘హిందుస్తాన్ టైమ్స్’ ప్రచురించిన వార్తా కథనం ప్రకారం…
ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మూడు రోజులపాటు ఛత్తీస్ గఢ్ లోని ప్రధాన అటవీ ప్రాంతంలో మావోయిస్టు నక్సల్స్ భారీ బల ప్రదర్శన చేస్తూ పది వేల మందితో సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణా సరిహద్దులను ఆనుకుని ఉన్న సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దు గ్రామాల్లోనే ఈ సమావేశం జరిగింది. గత డిసెంబర్ లో అనారోగ్యం కారణంగా మృతి చెందిన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (డికెఎస్జెడ్సి) స్పెషల్ కార్యదర్శి రామన్న స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై చర్చ జరిగింది.
మావోయిస్టు పార్టీ నూతన ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు, ఒకటో నెంబర్ బెటాలియన్ చీఫ్ మడవి హిడ్మా, కోసా, దేవ్ జీ, సుజాత తదితర అగ్రనేతలు సమావేశానికి హాజరయ్యారు.
మావోయిస్టులు నిర్వహించిన మూడు రోజుల సమావేశం గురించి తమకు సమాచారం ఉందని, తాము దాన్ని పరిశీలిస్తున్నట్లు ఛత్తీస్ గఢ్ డీజీపీ డీఎం అవస్థీ పేర్కొన్నట్లు ‘హిందుస్తాన్ టైమ్స్’ ఉటంకించింది. గడచిన ఐదేళ్ల కాలంలో మావోయిస్టులు ఇంత భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించిన నిర్వహించిన సమావేశం ఇది మొదటిదని కూడా పోలీసు అధికారులు అభిప్రాయపడినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఈ తరహా భారీ మీటింగ్ ను నక్సల్స్ చివరిసారిగా సుక్మా జిల్లాలోని పోటుంపల్లి గ్రామంలో నిర్వహించారని, తాజా సమావేశానికి సుక్మా, బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల నుంచి గ్రామస్తులు హాజరైనట్లు బస్తర్ ప్రాంత పోలీసు అధికారి తెలిపినట్లు ‘హిందుస్తాన్ టైమ్స్’ నివేదించింది.
మూడు రోజులపాటు సాగిన సమావేశపు ప్రాంతానికి భద్రతగా సాయుధులైన 300 మంది నక్సల్స్, మరో 500 మంది మిలీషియా సభ్యులు కాపలా కాశారు. ఈ భద్రతా వ్యవహారాలను మావోయిస్టు పార్టీ సీనియర్ నేత కిషన్ జీ భార్య సుజాత పర్యవేక్షించారని, మొబైల్ ఫోన్లను తీసుకువెళ్లేందుకు ప్రజలను నక్సల్స్ అనుమతించలేదని, దీంతో తమకు ఫొటోలు చేరలేదని ఓ పోలీసు అధికారి చెప్పినట్లు ‘హిందుస్తాన్ టైమ్స్’ వివరించింది.
ఈ మధ్య మరణించిన మావోయిస్టులకు సమావేశపు వేదికపై నక్సల్స్ నివాళి అర్పించారు. ఇదే సందర్భంగా క్రీడలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మినపా ఘటనలో 17 మంది పోలీసులను హతమార్చి లాక్కున్న ఆయుధాలను కూడా వేదికపై నక్సల్స్ ప్రదర్శించారు. తమ బలాన్ని ప్రజలకు చూపడానికి నక్సల్స్ ఈ తరహా సమావేశాలను నిర్వహిస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సల్వాజుడుం సంస్థ ఆవిర్భావానికి ముందు నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అడవుల్లో ఇదే తరహా సమావేశాన్ని నక్సల్స్ నిర్వహించారు. రానున్న కొద్ది రోజుల్లో ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను, పత్రికా ప్రకటనను నక్సల్స్ విడుదల చేసే అవకాశాలు లేకపోలేదని కూడా పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నట్లు ‘హిందుస్తాన్ టైమ్స్’ తన కథనంలో పేర్కొంది.