ఉరి తాళ్లతో తలార్లు సిద్ధం. ఒకరు కాదు ఇద్దరు రెడీగా ఉన్నారు నిర్భయ కేసులో దోషులకు ఉరి బిగించేందుకు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనలో దోషుల క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరిస్తే, ఆ వెంటనే కోర్టు బ్లాక్ వారెంట్ జారీ చేస్తుంది. కానీ వీరికి ఉరి వేసే తలారి లేడంటూ తీహార్ జైలు అధికారులు తెగ టెన్షన్ పడుతున్న సంగతి తెలిసిందే. అర్జంటుగా తలారి ఎక్కడ దొరుకుతాడంటూ ఉత్తరప్రదేశ్ గ్రామాలను తీహార్ జైలు అధికారులు జల్లెడ పడుతున్నారు. కానీ జైలు అధికారులు ఎక్కువగా శ్రమ పడకుండానే నిర్భయ ఘటన దోషులను ఉరి తీయడానికి తాము రెడీ అంటూ ఇద్దరు వ్యక్తు ముందుకు వచ్చారు. తలారి విధులు నిర్వహించడానికి తాము సిద్ధమంటూ ప్రకటించారు.
వీరిలో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఏకంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ కూడా రాశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 డిసెంబర్ 16వ తేదీ నాటి నిర్భయ ఘటన దోషులకు ఉరి వేసే అవకాశాన్ని తనకు ఇవ్వాలని రవికుమార్ కోరుతున్నారు. తీహార్ జైలులో దోషులను ఉరి తీసేందుకు తలారి లేనందున తనను తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని, నిర్భయ ఆత్మ శాంతిస్తుదని సిమ్లాకు చెందిన రవికుమార్ తన లేఖలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా దేశంలో మరో తలారి కూడా అందుబాటులో ఉన్నట్లు అధికారగణం గుర్తించింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన పవన్ కూడా నిర్భయ దోషులను ఉరి తీస్తానంటున్నారు. పవన్ ముత్తాత లక్ష్మన్ జల్లద్, తాత కాలూరామ్ జల్లద్, తండ్రి మమ్మూ జల్లద్ కూడా తలారి వృత్తిలో కొనసాగినవారేనట. ఈ వృత్తిలో పవన్ నాలుగో తరానికి చెందినవారు. పవన్ కు నెలసరి రూ. 25 వేల గౌరవ వేతనాన్ని కూడా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ దిశ ఘటనలతో తన గుండె బరువెక్కుతోందని, దిశ కేసులోనూ నిర్భయ తరహాలోనే తీర్పు వెలువడాలని పవన్ ఆశిస్తున్నారు. పవన్, రవి… ఈ ఇద్దరిలో ప్రభుత్వం ఎవరికి నిర్భయ దోషులను ఉరి తీసే అవకాశం కల్పిస్తుందో చూడాలి.