కొత్తగూడెం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే పేరు వనమా వెంకటేశ్వరరావు. గత ఎన్నికల్లో కొత్తగూడెం టీఆర్ఎస్ అభ్యర్థి, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే జలగం వెంకటరావును ఓడించింది కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు. ఇందులో ఏ సందేహమూ లేదు. గడచిన ఏడాదిన్నర కాలంలో వనమా వెంకటేశ్వరరావు తన వారసుని కోసం ఎమ్మెల్యే పదవిని ఏ రకంగానూ త్యజించలేదు. కాకపోతే కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి కేసీఆర్ సార్ కు జై కొట్టారు…. అంతే. ప్రస్తుతం ఆయన అధికార పార్టీలో ఉన్నారు కూడా.
కానీ గురువారం జరిగిన హరిత హారం కార్యక్రమం సందర్భంగా కొత్తగూడెంలోని రామా టాకీస్ ఏరియాకు చెందిన ఎస్. మధుసూదనరావు అలియాస్ చిన్ని అనే టీఆర్ఎస్ కార్యకర్త ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ స్థానికంగా రాజకీయ కలకలానికి దారి తీసింది. ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవను ఎమ్మెల్యేగా ఉటంకిస్తూ ఆయన ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం విశేషం. ‘ఆరో విడత హరితహారం కార్యక్రమానికి విచ్చేయుచున్న కొత్తగూడెం శాసనసభ్యులు వనమా రాఘవగారికి స్వాగతం, సుస్వాగతం’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కొత్తగూడెంలో చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ అన్నీ తానై తన తండ్రిని రాజకీయంగా ముందుండి నడిపిస్తారనే ప్రచారం ఉండడమే ఇందుకు కారణం. అయితే ఈ ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, అజయ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కొత్తగూడెం జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య, పల్లా రాజేశ్వరరెడ్డిల ఫొటోలు ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఫొటో మాత్రం లేకపోవడం గమనించాల్సిన అంశం.