ఫొటోను నిశితంగా పరిశీలించండి. ఫొటోలో క్లారిటీ లేకుంటే దిగువన గల ట్విట్టర్ వీడియోను చూడండి. ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణా సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించిన సందర్భంగా నాటిన మొక్కగా పేర్కొంటున్న ‘చెట్టు’ లాంటి దృశ్యమిది.
సీఎం చేతుల మీదుగా నాటించిన ఈ చెట్టు తరహా మొక్క ఇంత ఏపుగా ఉండడం వెనుక ఆసక్తికర అంశమే దాగి ఉంది. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాల్లో స్వల్ప వయస్సు గల మీటర్ లేదా మీటరున్నర పొడవు గల మొక్కలను మాత్రమే నాటుతారు. ఈ తరహా మొక్కల వేర్లు కూడా చాచుకుని బలంగా ఉంటాయి. అత్యంగా వేగంగా పెరుగుతాయి కూడా.
కానీ సీఎం కేసీఆర్ వంటి ప్రముఖులు నాటే ఇటువంటి మొక్కలను ‘వీఐపీ ప్లాంటేషన్ నర్సరీ’లో ప్రత్యేకంగా పెంచుతారు. దాదాపు చెట్టులాగే కనిపించే ఈ మొక్కల వయస్సు 3-5 ఏళ్ల మధ్య ఉంటుంది. వీటి వేర్లు ముడుచుకుని ఉంటాయని, నెమ్మదిగా పెరుగుతాయని అటవీ శాఖ అధికార వర్గాలు చెప్పాయి. అయితే ముఖ్యమంత్రి వంటి ప్రముఖులు పాల్గొనే కార్యక్రమాల్లో జనసమ్మర్ధం ఉండడం వల్ల చిన్న సైజు మొక్కలు ఫొటోల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించవట. అందుకే ఇంత ‘భారీ మొక్క’లను ప్రత్యేకంగా పెంచే వీఐపీ ప్లాంటేషన్ నుంచి తెప్పిస్తారట. అదీ సీఎం కేసీఆర్ నాటిన చెట్టులాంటి ఈ వీఐపీ మొక్క కథా కమామీషు!