జిల్లాలు పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే పనికొస్తాయి. జిల్లా కలెక్టర్‌ను కలవాలన్నా, కలెక్టర్ కార్యాలయంలో పని ఉన్నా అది ప్రజలకు అందుబాటులో ఉండాలి.
గతంలో అంటే ఎన్టీఆర్ మండల వ్యవస్థ ప్రవేశ పెట్టక ముందు కలెక్టర్ కార్యాలయం అంటే ఏదో పొరుగుదేశం వెళ్ళినట్టు ఉండేది. తాలూకా కార్యాలయానికి వెళ్ళి పనిచేసుకోవడమే కష్టంగా ఉండేది. ఒక గ్రామం నుండి తాలూకా అంటే అత్యధికంగా 40 నుండి 50 కిలోమీటర్ల దూరం ఉండేది. బస్సు సౌకర్యం కూడా సరిగా లేని రోజుల్లో గ్రామం నుండి తాలూకా కార్యాలయానికి వెళ్ళడం అంటే ఒక రోజు పని. అక్కడ బంధువులు ఉంటే సరి… లేకపోతే ఆ తిప్పలు వర్ణనాతీతం. ఇంత కష్టపడ్డా పని ఒక్కరోజులో అవుతుందనే గ్యారంటీ లేదు. ఈ బాధలన్నీ ఎన్టీఆర్ తీర్చేశారు. మండల వ్యవస్థ వచ్చాక మండల కార్యాలయానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చే వెసులుబాటు ఉండేది.
ఇప్పుడు పాలన మరింత దగ్గరయింది. గ్రామ సచివాలయాలు వచ్చి అధికార యంత్రాంగాన్ని గ్రామంలోనే కూర్చోబెట్టాయి. ఇంటినుండి పదినిమిషాల్లో గ్రామ సచివాలయానికి చేరుకోవచ్చు. పని అవకపోతే మరో రోజు వెళ్ళొచ్చు. వారాలు, నెలలు పట్టినా అధికారుల చుట్టూ తిరగొచ్చు. ఊళ్ళో తిరగడమేగా! అధికారులు ఎలాగూ అడిగినవెంటనే పనిచేయరు. చేయి తడపకుండా కూడా పని చేయరు. అది వేరే విషయం.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పాలనా సంస్కరణ మొదలవబోతోందని వార్తలొస్తున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి 25 జిల్లాలుగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ చర్య నవరత్నాల్లో లేదుకానీ ఇది కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీయే. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆ మేరకు చర్యలు మొదలైనట్టు తెలుస్తోంది.
అయితే ముఖ్యమంత్రి ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా జిల్లాలు ఏర్పాటు చేయడం సరికాదు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు శాస్త్రీయత లేదు. జనాభా ప్రాతిపదికగా అవి మారుతూ ఉంటాయి. నియోజకవర్గాల పునర్ వ్యవస్తీకరణ జరిగిన ప్రతిసారీ వాటి స్వరూపం మారుతుంది. మళ్ళీ 2026లో నియోజకవర్గాల పునర్ వ్యవస్తీకరణ జరుగుతుంది. అప్పుడు నియోజకవర్గాల స్వరూపం మారుతుంది. అందువల్ల పార్లమెంటు నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదు.
ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సామాజిక, ఆర్ధిక, రాజకీయ, చారిత్రక పరిస్థితులను బట్టి జిల్లాల పునర్ వ్యవస్తీకరణ జరిగితే అది శాస్త్రీయంగా ఉంటుంది. ప్రధానంగా కొన్ని ప్రాంతాలకు ఒక చారిత్రక, సాంస్కృతిక అనుబంధం ఉంటుంది. కోనసీమ, కొల్లేరు, పల్నాడు ఇలా అనేక బంధాలు, అనుబంధాలు ఉన్నాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఒక శాస్త్రీయమైన అధ్యయనం జరగాలి. ప్రజల్లో విస్తృత చర్చ జరగాలి. ఆ తర్వాతనే ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు.
✍️ గోపి దారా