తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వయో పరిమితిని సీఎం కేసీఆర్ పెంచుతారా? లేదా? పెంచితే ప్రస్తుత 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతారా? లేక 61 ఏళ్లకు పొడిగిస్తారా? అసలు పెంచే అవకాశం ఉందా? లేదా? ఏ విషయమూ ఈ నెలాఖరుకల్లా తేలే అవకాశం ఉందా? అందుకు ఓ ఉద్యోగ సంఘ నాయకుడి రిటైర్మెంట్ కీలకమవుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న సందేహాలివి.
వాస్తవానికి ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచనున్నట్లు గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. పొరుగు గల ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడి అసెంబ్లీ ఎన్నికలకు ముందే వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా? లేదా? అనే సందేహాలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పలు అంశాలను ప్రామాణికంగా తీసుకుని లోతుగా పరిశీలిస్తే తమ రిటైర్మెంట్ వయస్సు పెంపు అంశంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది.
పెంచితే సర్కారుకేంటి?
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచితే సర్కారుకు ఆర్థికపరమైన వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుత జూన్, వచ్చే జూలై, ఆగస్టు నెలల్లో ఎన్నడూ లేనంత భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైరవుతున్నట్లు సమాచారం. ఈ సంఖ్య వేలల్లో ఉంటుందంటున్నారు. రిటైర్మెంట్ సందర్భంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి గ్రాట్యుటీ కింద రూ. 12 లక్షలు, కమిటేషన్ కింద రూ. 16 నుంచి 20 లక్షలు, జీపీఎఫ్ ఖాతా నుంచి రూ. 10 నుంచి 15 లక్షల వరకు సర్కారు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన ప్రభుత్వ జీవిత బీమా ద్వారా, గ్రూప్ ఇన్సూరెన్స్ కింద రూ. 2 లక్షల చొప్పున రూ. 4 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా రిటైరైన ప్రతి ఉద్యోగికి రూ. 50 లక్షలకు తగ్గకుండా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.
జూన్, జూన్, ఆగస్టు నెలల్లో రిటైరవుతున్న సుమారు 8 వేల మంది ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి రూ. 50 లక్షల మొత్తం చెల్లింపుల ప్రాతిపదికన రూ. 4,000 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా ఆయా మొత్తం చెల్లించే స్థోమత ప్రభుత్వానికి లేదనే వాదన వినిపిస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సర్కారు ముందున్న తక్షణ కర్తవ్యమేంటి? ఇదీ అసలు ప్రశ్న.
కరోనా కల్లోలం, ఆర్థిక భారం అంశాలను బేరీజు వేసుకున్నపుడు వయో పరిమితి పెంపునకే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుత వయో పరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచితే ఒనగూరే ప్రయోజనంపైనా ప్రభుత్వానికి క్లారిటీ ఉందంటున్నారు. ఉదాహరణకు పదవీ విరమణ చేసిన ఉద్యోగికి ప్రస్తుతం ప్రభుత్వం అన్ని రకాల బెనిఫిట్స్ కింద రూ. 50 లక్షలు చెల్లించాలి. ప్రస్తుతం ప్రతి ఉద్యోగి వేతనం రూ. లక్షగా పరిగణించినా, అందులో సగం, అంటే రూ. 50 వేల పెన్షన్ నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది.
కానీ వయో పరిమితిని పెంచితే రూ. 50 లక్షల చొప్పున 8 వేల మంది ఉద్యోగులకు సంబంధించిన మొత్తం రూ. 4 వేల కోట్లు సర్కారు వద్ద సేఫ్ గా ఉంటుంది. కానీ ఉద్యోగికి రిటైర్మెంట్ వయస్సు పెంచి కొనసాగిస్తే నెలకు రూ. లక్ష చొప్పున రెండేళ్లపాటు ఇచ్చే వేతనం మొత్తం కేవలం రూ. 24 లక్షలే. రిటైర్మెంట్ అనంతరం ఇచ్చే రూ. 50 వేల పెన్షన్ ను ఇందులో నుంచి మినహాయిస్తే ఇక ఉద్యోగికి సర్కారుకు ఇచ్చే వేతనపు మొత్తాన్ని రూ. 50 వేలుగానే పరిగణించాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇచ్చే రూ. 50 లక్షలకు రూాపాయి వడ్డీ చొప్పున పరిగణించినా రూ. 50 వేల వరకు వడ్డీ కూడా మిగులుబాటు అవుతుంది.
అంటే వయో పరిమితి పెంచిన ఉద్యోగిని పూర్తిగా వేతనం లేకుండానే రెండేళ్లపాటు పని చేయించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి లభిస్తుంది. ఒకవేళ బెనిఫిట్స్ మొత్తం రూ. 50 లక్షలకు రూపాయి వడ్డీ చొప్పున లభించే రూ. 50 వేల మొత్తాన్ని తీసివేసినా, రూ. లక్ష వేతనం గల ఉద్యోగి నెలకు రూ. 50 వేలకే రెండేళ్లపాటు కొలువు నిర్వహిస్తాడు. అంటే ఏ రకంగా చూసినా వయో పరిమితి అంశం సర్కారుకు ఆర్థికంగా అత్యంత లాభసాటి అంశమనే చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి లెక్కలు ఆర్థిక మంత్రి హరీష్ రావుకు తెలుసని ఉద్యోగవర్గాలు ఉటంకిస్తున్నాయి.
ఆయా లెక్కల గణాంక వివరాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఉద్యోగుల వయో పరిమితి పెంపునకే మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ మరో కీలక కోణం నుంచి విశ్లేషించినపుడు మాత్రం ఉద్యోగుల వయో పరిమితి పెంచకుండానే సర్కారు ముందడుగు వేసే అవకాశాలూ లేకపోలేదు.
వాటి వివరాలు తరువాత కథనంలో…. (మరికొద్ది సేపట్లోనే)