కరోనా కల్లోల పరిస్థితుల్లో ఆదాయం పూర్తిగా పడిపోయి ఆర్థికంగా తెలంగాణా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పేదలను ఆదుకునే కార్యక్రమాలను అమలు చేసేందుకు, ఆర్థిక వెసులుబాటులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో ప్రభుత్వం కోత విధించిన విషయమూ తెలిసిందే కదా? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారుల వేతనాల్లో 60 శాతం, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, నాలుగో తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించారు. ఇక ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్ల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వరకు నాయకుల వేతనాల్లోనూ 75 శాతం వరకు కోత విధించారు.
తాజాగా ‘లాక్ డౌన్’లో సడలింపుల కారణంగా లిక్కర్ షాపులు సహా అనేక వ్యాపార కార్యకలాపాలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో కొంచెం కొంచెం రాష్ట్ర ఆదాయ పరిస్థితి కూడా మెరుగైనట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఉద్యోగులపై, పెన్షనర్లపై సీఎం కేసీఆర్ సారుకు జాలి కలిగింది. ఆయా వర్గాలకు జూన్ నెల వేతనాన్ని పూర్తిగా చెల్లించాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు ఓ రకంగా ఇది శుభవార్తగానే పాలకవర్గాలు అభివర్ణించాయి. కరోనా కల్లోల పరిణామాల్లోనూ పూర్తి స్థాయి వేతనం చెల్లించేందుకు సాహసించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉద్యోగ సంఘాలు సహజంగానే కృతజ్ఞతలు చెప్పాయి. ఆయా సంఘాలకు చెందిన పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇంకొందరు ముఖ్యనేతలు మంత్రి కేటీఆర్ ను కలిసి మొక్కను అందజేసి ధన్యవాదాలు కూడా తెలిపారు. ఆయా అంశాలకు సంబంధించి ఈరోజు పత్రికల్లో ప్రముఖంగా వార్తలు కూడా వచ్చాయి. ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదుగా!
కట్ చేసిన వేతనాన్ని పూర్తిగా ఇస్తున్నందుకు ఉద్యోగ వర్గాలు సంతోషించాలి కదా? సీఎం సారు ఉద్యోగులకు, పెన్షనర్లకే మాత్రమే కదా… జూన్ నెల పూర్తి వేతనాన్ని ప్రకటించింది? తనకు, తన మంత్రివర్గ సహచరులకు, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు పూర్తి వేతనం ఇస్తామని చెప్పలేదుగా? కానీ కొన్ని ఉద్యోగ వర్గాలు కేసీఆర్ సార్ అంతరంగాన్ని, దయా గుణాన్ని, జాలి గుండెను పూర్తిగా అవగతం చేసుకోలేదనే వాదన వినిపిస్తోంది. అందుకే కాబోలు… నిన్నటి పూర్తి వేతనాల ప్రకటన, ఆ తర్వాత ఉద్యోగ సంఘాల వ్యవహార శైలి గురించి ‘ఇరుకు ఇల్లు… రెండు దున్నపోతుల కథ’ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఓ వ్యంగ్య రచనా పోస్టును ఉద్యోగ వర్గాలు తెగ షేర్ చేస్తున్నాయి. అదేమిటో దిగువన మీరూ చదవండి.
ఇరుకైన ఇల్లు … రెండు దున్నపోతుల కథ …(కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు తప్పక చదవాల్సిన కథ…)
**************************
“ఇల్లు ఇరుగ్గా ఉంది…సాయం చేయండి”, …అని ఒక అమాయకుడు రాజు దగ్గరికి పోతే… “రెండు దున్నపోతులను ఇంట్లో కట్టెయ్…సమస్య పోతది…”అని చెప్పి ఇంటికి పంపించిండట రాజు… ఆ అమాయకుడికి మొదట అర్దం కాలే…
దున్నపోతులను ఇంట్లో కట్టేసిన తరువాత, ఇల్లు మరీ ఇరుకై “మహాప్రభో …రక్షించండి…” అని కాళ్లా, వేళ్లా పడితే… “, మూడు నెల్లాగి, “దున్నపోతులను బయట కట్టేసుకో… ఇల్లు సరిపోతుంది…” అని “ఇంకపో …” అని గద్దించాడట…!
దున్నపోతులను బయట కట్టేసి…”అబ్బ…ఇల్లు ఎంత విశాలమైందో…” అని మురిసిపోయాడట…పోయి కృతజ్ఞతతో రాజు కాళ్ళ మీద పడ్డాడట ఆ అమాయకుడు…
రాష్ట్రంలో కొందరు ఉద్యోగ సంఘాల నాయకుల పరిస్తితి అలాగే ఉంది… “యాభై శాతం జీతాలు పెంచండి..” అని… ప్రభుత్వాన్ని కోరితే… యాభై శాతం కోసి… ఉద్యోగులు “లబో…దిబో…” మని మొత్తుకుంటుంటే …, పాత జీతాన్నే తిరిగి ఇచ్చి “ఇగబొండి…”…అని పంపితే… ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై కృతజ్ఞతలు చెబుతున్న కొందరు ఉద్యోగ సంఘాల నాయకులను చూస్తే ఇదే కథ గుర్తుకొస్తున్నది… ఇక జీతాలు పెంచమనే ఆలోచన వాళ్లకు ఇప్పట్లో వస్తే అడగండి…?