ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈనెల పూర్తి వేతనం చెల్లించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ఈనెల పూర్తి వేతనాలు చెల్లించాలని తెలంగాణా సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమేణా మెరుగవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
కరోనా కష్ట సమయంలో పేదలను ఆదుకునే కార్యక్రమాలు అమలుచేయడానికి వీలుగా ఆర్థిక వెసులుబాటు కల్పించే లక్ష్యంతో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వెంట్లు, ఉద్యోగులకు అందాల్సిన వేతనాల్లో కోత పెట్టాలని మార్చి 30న ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాయి.
ఈమేరకు ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారుల వేతనాల్లో 60 శాతం, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే.
కాగా ముఖ్యమంత్రి సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వరకు వారి వేతనాల్లో 75 శాతం కోత విధించిన అంశంపై ఈ సందర్భంగా ఏ నిర్ణయం ప్రకటించకపోవడం గమనార్హం. ఉద్యోగులకు, పెన్షనర్లకు మాత్రమే ఈనెల పూర్తి వేతనం చెల్లించాలని సీఎం ఆదేశించడం విశేషం.