కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీహెచ్ కరోనా బారిన పడిన ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కలకలానికి కారణమైంది. ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులేగాక ఇతరులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడో హైదరాబాద్ లో గల హనుమంతరావుకు కరోనా సోకితే 200 నుంచి 325 కిలోమీటర్ల దూరంలో గల ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు హైరానా పడడం దేనికంటే…?
ఈనెల 13వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే కదా? ఇందులో భాగంగానే దుమ్ముగూడెం ప్రాజెక్టువద్ద చేపట్టనున్న జలదీక్షలో పాల్గొనేందుకు వీహెచ్ 12వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారు. రాజధాని కేంద్రం హైదరాబాద్ నుంచి ఆయన ఖమ్మం నగరానికి చేరుకుందే తడవుగా కొందరు బీసీ నాయకులు ఆయనకు ఎప్పటిలాగే స్వాగతం చెబుతూ, ఓ ముఖ్య బీసీ నేత ఇంటికి తీసుకువెళ్లి ‘టీ’ పార్టీ ఇచ్చారట.
అనంతరం వీహెచ్ కొత్తగూడెం వెళ్లగా అక్కడి వన్ టౌన్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కొద్ది గంటల తర్వాత వదిలేశారు. ఆరోజు రాత్రి ఇల్లెందు గెస్ట్ హౌజ్ లో బస చేసిన వీహెచ్ 13న జలదీక్షకు బయలుదేరగా లక్మీదేవిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను పోలీసులు నిలువరించిన ఘటనపై స్టేషన్ ఆవరణలోనే హనుమంతరావు విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత సింగరేణి గెస్ట్ హౌజ్ కు కూడా వెళ్లారు. అక్కడి నుంచి భద్రాచలం వెళ్లి రాములవారి దర్శనం చేసుకుని, కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో సంభాషించారు.
మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వీహెచ్ జలదీక్ష పర్యటన ప్రకంపనలు రేపుతోంది. వీహెచ్ రాక సందర్భంగా ఆయనతో సన్నిహితంగా మెలిగినవారు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇందులో భాగంగానే పలువురు హోం క్వారంటైన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.