“They force us to work like bonded labourers. There is no self respect. I have already been given the target for election expenses. Is this why I studied to become an IPS officer ? Uniformed officers are being compelled to become extortionists.”
– Rahul Sharma’s post on Facebook.com on March 5th, 2012 on the state of affairs in Chhattisgarh.
‘‘వెట్టి కార్మికులుగా పని చేయాలని వాళ్లు మమ్మల్ని బలవంతం చేస్తారు. అక్కడ ఆత్మగౌరవం లేదు. ఎన్నికల ఖర్చు టార్గెట్ కూడా ఇప్పటికే ఇచ్చారు. నేను ఐపీఎస్ ఎందుకు చదువుకున్నాను? దోపిడీదారునిగా మారాలని ఒత్తిడి చేస్తున్నారు’’ అంటూ రాహుల్ శర్మ అనే ఐపీఎస్ అధికారి తన ఫేస్ బుక్కులో 2012 మార్చి 5వ తేదీన రాసుకున్న వ్యాఖ్యల తెలుగు అనువాదమిది.
ఈ రాతలు రాసిన కొద్ది రోజులకే అంటే మార్చి రెండో వారంలోనే ఆ 34 ఏళ్ల యువ ఐపీఎస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో ఆయన బిలాస్ పూర్ ఎస్పీగా పని చేస్తున్నారు. అంతకు ముందు దంతెవాడ ఎస్పీగా పని చేశారు. నక్సల్ కార్యకలాపాల అణచివేతలో మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ శర్మ పోలీస్ మెస్ వద్ద వాష్ రూంలోకి వెళ్లి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న ఘటన అప్పట్లో తీవ్ర కలకలం కలిగించింది. ఛత్తీస్ గఢ్ పోలీసు యంత్రాంగాన్ని ఓ కుదుపు కుదిపిందనే చెప్పాలి. రాహుల్ శర్మ తన ఆత్మహత్యకు ముందు రాసుకున్న లేఖ కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ అప్పటి బిలాస్ పూర్ ఐజీతోపాటు మరో ఆరుగురు పోలీసు అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిందన్నది వేరే విషయం.
అప్పటి ఉదంతాన్ని ఇప్పడు ప్రస్తావించడానికి గల కారణానికి వస్తే, అదే రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో ఓ జవాన్ సహచర ఐదుగురు జవాన్లను తుపాకీతో కాల్చి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణపూర్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని కడెనార్ అటవీ ప్రాంతంలోని క్యాంపులో రెహమాన్ ఖాన్ అనే ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) జవాన్ తన సహచర ఐదుగురు జవాన్లను కాల్చిచంపిన సంఘటన అక్కడి పోలీసు వర్గాలను మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. ఘటన అనంతరం రెహమాన్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఇద్దరు జవాన్లు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. తనకు సెలవు ఇవ్వడం లేదనే ఆక్రోశంతో రెహమాన్ ఈ సంఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. మొత్తం ఆరుగురు ఐటీబీపీ పోలీసులు ఈ ఘటనలో దుర్మరణం చెందినట్లు నారాయణపూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ ధృవీకరించారు.
అయితే అడవులు, లేదంటే బేస్ క్యాంపులు. ఇదే ఛత్తీస్ గఢ్ అడవుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల జీవితం. ఈ జీవితాల్లో నిత్య సంతోషాలు ఏమీ ఉండవు. కేవలం అప్పగించిన బాధ్యత తప్ప. ఎంతగా బాధ్యతల్లో ఉన్నప్పటికీ వాళ్లూ మనుషులే. వాళ్లకీ అవసరాలు ఉంటాయి. కుటుంబ సభ్యులను చూడాలనిపిస్తుంది. ఇందుకు సెలవు అవసరం. అవసరం ఉన్నపుడే సెలవు మంజూరు చేస్తే అడవుల్లోనే జీవితాన్ని వెళ్లదీస్తున్న పోలీసులకు కాస్త రిలీఫ్. లేదంటే తీవ్ర ఒత్తిడికి గురైనప్పడు వాళ్ల జీవితాలు ఇలా అర్థంతరంగా ముగుస్తుంటాయి. ఆయన ఐపీఎస్ అధికారి రాహుల్ శర్మ కావచ్చు, సాధారణ జవాన్ రెహమాన్ ఖాన్ కావచ్చు. ఈ తరహా విషాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ఆశిద్దాం..