‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’ అనేది నానుడి. కొన్ని ఘటనలు చూసినపుడు సామెత కరెక్టే అనిపిస్తుంది కూడా. టీవీ9 తెలుగు న్యూస్ ఛానల్ తెలుసుగా…? అయినా ఈ న్యూస్ ఛానల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు తక్కువ మందే ఉంటారు లెండి. ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ9 పుట్టుక నుంచి, దాని ఒకప్పటి సీఈవో రవిప్రకాష్ అరెస్ట్ వరకు జరిగిన పరిణామాలు మీడియాలో మరపురాని ఘట్టాలుగానే పలువురు అభివర్ణిస్తుంటారు.
కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలోనూ టీవీ9కు తనదైన శైలిలో పేరు ప్రఖ్యాతులు ఉండనే ఉన్నాయి. సినీ నటి శ్రీదేవి మృతి ఘటన సందర్భంగా ‘బాత్ టబ్బు’లో పడుకుని మరీ వార్తా కథనం వడ్డించిన జర్నలిజపు తీరు ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలోనే మరపురాని ఘటన కావచ్చు. న్యూస్ ప్రెజెంటేషన్ ఇలా కూడా ఉంటుందా? ఎవరైనా రైతు పురుగు మందు తాగి చనిపోతే ఆ వార్తా కథనాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తారో మరి? అనే సందేహాలతో కూడిన విమర్శలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. టీవీ9 తరహా వార్తా కథనాలకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే.
ఇక తాజా అంశంలోకి వస్తే… ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి టీవీ9 ఈరోజు ఓ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. ఈ వార్తా కథనంలో ‘కంటెంట్’ సంగతి ఎలా ఉన్నప్పటికీ, చివరలో సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన ‘‘బైట్’ ఒకటి ప్రసారం కావడం జర్నలిస్టు సర్కిళ్లలో చర్చకు దారి తీసింది. వైరా ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలకు, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యేకు సంబంధించిన నిత్యాన్నదాన దృశ్యానికి లింక్ ఏమిటో బోధపడక, తలలు నిమురుకున్న టీవీ9 ప్రేక్షకులు కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగుకు దిగారు.
అబ్బే… సాంకేతిక సమస్య కావచ్చునని తేలిగ్గా తీసి పారేస్తే ఎలా…? దీన్నే జర్నలిజంలో బాధ్యతారాహిత్యం అంటారు. అసందర్భ విజువల్స్ ద్వారా వార్తా కథనాన్ని ప్రసారం చేయడం టీవీ9 సంస్థకు మాత్రమే చెల్లిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ‘టీవీ9కు ప్రేక్షకుడు లోకువ’ అనాల్సి వచ్చింది.
వైరా ఎమ్మెల్యే బర్త్ డే వార్తా కథనంలో సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే నిత్యాన్నదానానికి సంబంధించిన ‘బైట్’ను దిగువన గల టీవీ9 వార్తా కథనపు లింకులో మీరూ చూడవచ్చు.