శీర్షిక చదివాక… నువ్వూ జర్నలిస్టువే కదా? ఇదేం పోలిక? పద్ధతేనా? అని జర్నలిస్టు సోదరులు లోలోన ఆగ్రహించాల్సిన అవసరం లేదు. విషయం మొత్తం చదివాక ‘ఛీ… థూ… వీళ్లూ జర్నలిస్టులేనా?’ అని మరింత పరుష పదజాలంతో మీరూ వ్యాఖ్యనించే అవకాశం లేకపోలేదు.
జర్నలిస్టుకు జర్నలిస్టే శత్రువు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దశాబ్దాల జర్నలిజంలో కుళ్లు చరిత్ర చెబుతున్న అంశమిదే. చేవలేని, లేవలేని, రాయలేని ‘కిచిడీ’ జర్నలిస్టులు అప్పుడప్పుడూ ‘ఆకాశ రామన్న’లుగా మారుతుంటారు. ఫలానా జర్నలిస్టు ఉద్యోగానికి ముప్పు కలిగిస్తే ఆ సంస్థలోని ఉద్యోగం తమకు దక్కుతుందనేది ఆకాశ రామన్న జర్నలిస్టుల వక్రబుద్ది. కానీ వారి ఆశలు అడియాసలేనని పలు సార్లు రుజువైంది కూడా.
ఇటువంటి జర్నలిస్టులకు సహకరించేందుకు జర్నలిజంలో కాస్త పెద్ద తలకాయలు కూడా ఉంటుంటాయి. సంప్రదాయ జిహ్వ చాపల్యానికి విరుద్దంగా గోదావరి జిల్లాల ‘పులస’ చేపల రుచికి అలవాటు పడిన ‘స్మగ్లర్’ నెట్ వర్క్ ఇంచార్జిలు, మఫసిల్ ఎడిటర్లు కూడా ఫీల్డులో తారసపడిన ఘటనలు అనేకం. కంట్రిబ్యూటర్లను సైతం బదిలీ చేసి ‘పబ్బం’ గడుపుకునే నెట్ వర్క్ ఇంచార్జిల చరిత్ర కూడా లిఖితమై ఉండనే ఉంది. సరే… ఇదంతా పాత ముచ్చట. ఇక అసలు విషయంలోకి వెడదాం.
కరోనా కల్లోల పరిణామాల్లో అనేక మీడియా సంస్థలు ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఫలానా సంస్థ అతీతమని కూడా చెప్పే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలోనే చారిత్రక నేపథ్యం గల ‘ది హిందూ’ ఆంగ్ల పత్రిక సైతం కరోనా ధాటికి విలవిలలాడుతోంది. దేశ వ్యాప్తంగా దాదాపు 120 మంది స్టాఫ్ రిపోర్టర్ల ఉద్యోగాలకు ఎసరు పెట్టినట్లు తాజా వార్త.
ఇందులో భాగంగానే తెలంగాణాలోని పది మంది స్టాఫ్ రిపోర్టర్లకు కూడా ఉద్యోగపరంగా ప్రమాద ఘంటికలు మోగాయి. కొందరికి ఫోన్లు, మరికొందరికి మెయిల్స్ వచ్చాయి. ‘మీరు నైపుణ్యత గల రిపోర్టర్లే. ఇన్నాళ్లపాటు చాలా కష్టపడి పనిచేశారు. ఈ విషయంలో ఏ సందేహమూ లేదు. కానీ కరోనా పరిణామాల వల్ల సంస్థ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కుంటోంది. అందువల్ల ఈ నెలాఖరు వరకు మీరు మీ ఉద్యోగానికి రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది.’ ఇదీ హిందూ రిపోర్టలకు సంస్థ నుంచి అందిన తాఖీదుల సారాంశం.
అనివార్య పరిస్థితుల్లో రాజీనామా సమర్పించే వారికి సంస్థ ఏ ప్రయోజనాలు సమకూరుస్తుంది? ఆర్థికంగా ఎటువంటి లబ్ధి చేకూరుస్తుందనేది ‘హిందూ’ యాజమాన్యపు వైఖరిపై ఎటువంటి సందేహాలు లేవు. ఎందుకంటే గతంలో అమలు చేసిన ‘గోల్డెన్ షేక్ హ్యాండ్, వీఆర్ఎస్’ అంశాల్లో ఆ సంస్థ తన ఉద్యోగులను చిన్న చూపు చూడలేదు. జర్నలిస్టుల బతుకు మరీ బజారుపాలు చేసేందుకు మన తెలుగు మీడియాలోని కొన్ని సంస్థల టైపు ‘హిందూ’ ఏమాత్రం కాదు.
కానీ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడిన తాజా పరిణామాల్లో తాఖీదులు అందుకున్న ‘హిందూ’ రిపోర్టర్లు బిక్కు బిక్కుమంటుండగా, మరికొందరు జర్నలిస్టులు ఏం చేశారో తెలుసా? ప్రస్తుత హిందూ రిపోర్టర్లకు తాఖీదులు అందినట్లు బహిర్గతమైందే తడవుగా, అనేక మంది జర్నలిజపు ‘కొత్త బిచ్చగాళ్లు’ వేగంగా దరఖాస్తులు చేశారట. తాము తక్కువ వేతనాలకే పనిచేస్తామని, ఖాళీ అయిన చోట తమకు అవకాశం కల్పించాలని అనేక మంది దరఖాస్తులు పంపారట. ఇంకొందరైతే వేతనాల గురించి తమకు పట్టింపు లేదని, ‘హిందూ’ రిపోర్టర్ గా అవకాశం కల్పిస్తే చాలునని అభ్యర్థించారుట.
ఇప్పుడు చెప్పండి. కొందరు జర్నలిస్టులు ‘కరోనా’పై పేలాలు ఏరుకుంటున్నట్లా? కదా? శీర్షికలో తప్పేమీ లేదుగా! ఇప్పుడేమంటారో ఇక మీ ఇష్టం.