కరోనా తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేసిన విజ్ఞప్తికి ప్రధాన మంత్రి స్పందించారు. దేశంలో ‘లాక్ డౌన్’ల దశ ముగిసి, ‘అన్ లాక్’ల దశ ప్రారంభమయిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.
‘‘దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారేమోననే ప్రచారం జరుగుతున్నది. ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడుతున్నారనగానే లాక్ డౌన్ ప్రకటన చేస్తారని అనుకుంటున్నారు. ప్రధాన మంత్రి అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడకుండా లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తీసుకోరు అని నేను చెబుతున్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
‘‘దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్ డౌన్ ముగిసింది. అన్ లాక్ 1.0 నడుస్తున్నది. అన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలి’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు.