‘తడిస్తే గాని గుడిసె కప్పరు’ అనే సామెత తెలంగాణాలో బాగా పాపులర్.
ఇప్పుడంటే బంగ్లాలు, భవంతులు, పాలకుల పుణ్యమా అని డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చాయి గాని, ఇంకా అనేక గిరిజన గూడేల్లో, పలు మురికివాడల్లో ఇప్పటికీ మనకు పూరి ‘గుడిసె’లు కనిపిస్తుంటాయి.
ఏటా వర్షాకాలానికి ముందే తాము నివసించే గుడిసెలను అందులో నివసించే పేదలు మరమ్మతులు చేసుకుంటుంటారు.
అడవుల్లో లభించే ‘కోపిరి’, చెరువుల్లో, కుంటల్లో లభ్యమయ్యే ‘తుంగ’ గడ్డి మోపులతో గుడిసెలను కప్పుతుంటారు. గడచిన ఏడాది కాలంలో గుడిసెకు ఎక్కడెక్కడ రంధ్రాలు పడ్డాయో, వర్షాకాలం ప్రారంభమైతే ఎక్కడెక్కడ గుడిసె కురిసే అవకాశముందో నిశితంగా పరిశీలించి వివిధ రకాల గడ్డితో కప్పుతుంటారు.
సూక్ష్మంగా చెప్పాలంటే గుడిసెకు పకడ్బందీగా మరమ్మతులు చేస్తుంటారు. బీభత్సమైన వర్షాలు కురిసినా ఇంట్లో నీటి చుక్క పడని విధంగా ‘గుడిసె’ను కప్పుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో సహజమైన ముందు చూపు విద్య ఇది.
కానీ ఊరు అన్నాక రకరకాల స్వభావం గల మనుషులు ఉంటుంటారు కదా…! వర్షమా? నా గుడిసెకా? వర్షం నా గుడిసెను తాకుతుందా? అది నన్నేం చేస్తది? నా గుడిసెను వర్షం తాకితే ఊరుకుంటామా? ఇంట్లో ఉన్న వారందరమూ వర్షంతో యుద్ధం చేయమా? అవసరమైతే ఏడంతస్తుల మేడ కట్టేంత డబ్బునైనా వెచ్చించి గుడిసెను మరమ్మతు చేస్తాం. ఎక్కడో మబ్బు నుంచి వచ్చే వర్షం నా గుడిసెను తాకుతుందా? అని కొందరు ధీమాను వ్యక్తం చేస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే బీరాలు పలుకుతుంటారు.
ఇటువంటి ‘గొప్పలు’ చెప్పేవాళ్ల మాటలకు వర్షం రాకుండా ఉంటుందా? వర్షాకాలం రానే వచ్చింది. చుట్టుపక్కల వాళ్లు గుడిసెలు కప్పుకుంటున్నా, బీరాలు పలికిన వ్యక్తిలో ఏ మాత్రం చలనం లేదు. గుడిసె కప్పే సంగతి దేవుడెరుగు, కనీసం దానికి గల రంధ్రాలను పరీక్షించేందుకు కూడా దాని యజమాని సాహసించిన దాఖలాలు లేవని చుట్టుపక్కలవారు అంటూనే ఉన్నారు.
ఇదిగో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ గల వ్యక్తి గుడిసెకు ముప్పు రానే వచ్చింది. రిపేరుకు సైతం ఉద్యుక్తం కాని బీరాల మనిషి గుడిసెను వర్షం తాకింది. వర్షం జోరు పెరిగింది. ఇంట్లోకి వర్షం నీరు రానే వచ్చింది.
తొలుత ఇంట్లోని ఓ వ్యక్తి వర్షానికి తడిశాడు. తాజాగా మరో వ్యక్తి వర్షం ధాటికి విలవిలలాడుతున్నాడు. వర్షం తాకిడి తీవ్రత ఏమిటో ఇంటి యజమానికి తెలిసొచ్చినట్లుంది. జగమంత తన కుటుంబంలోని ఇద్దరు ముఖ్యులైన వ్యక్తులు గుడిసె కురిసిన కారణంగా జలుబు, జ్వరం బారిన పడ్డారు. ఇంటి యజమానికి గుబులు మొదలైంది. ఎందుకంటే గుడిసె తడిసి వర్షంలో నానిన ఇద్దరూ తమ కుటుంబ సభ్యులే మరి. వారి జ్వరం, జలుబు తనకు అంటుకునే అవకాశమే కాదు, వర్షం ధాటికి గుడిసె మరింత తడిసి కుప్ప కూలినా ఆశ్చర్యం లేదనే ఆందోళన మొదలైంది.
అందుకే కాబోలు ఇంటి యజమాని గ్రామం మొత్తంగా దండోరా వేయించాడు. వర్షం ధాటికి గుడిసెలు కురుస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని పరిసరవాసులకు హితవు చెబుతున్నాడు. చుట్టుపక్కల గల గుడిసెలను పరిశీలింపజేస్తానని, పరీక్షిస్తానని చెబుతున్నాడు. మొత్తానికి తన ఇంటిని తడిపిన వర్షం దెబ్బ ఎలా ఉంటుందో, దాని ప్రభావం ఏమిటో గుడిసె యజమానికి తెలిసొచ్చింది.
దీన్నే ‘తడిస్తే గాని గుడిసె కప్పరు’ అంటుంటారు. తెలంగాణా పల్లెల్లో మస్తు పాపులర్ ఈ నానుడి. ‘చెప్పంగ విననోన్ని చెడంగ జూడాలె’ అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఇదే పరిస్థితి.
ముఖ్య గమనిక: పైన పేర్కొన్న సామెత కథనం యావత్తూ వర్షానికి తడుస్తున్న ‘గుడిసె’ గురించి మాత్రమే. మరే ఇతర సమకాలీన అంశానికి సంబంధించినది కాదని, ఎవరైనా, మరి దేనికైనా అన్వయించుకుంటే బాధ్యత మాది కాదని యావన్మందికీ తెలియజేయనైనది.