తెలంగాణాలోని అధికార పార్టీలో కరోనా కలవరం కలగిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కరోనా వైరస్ వెంటాడుతుండడమే ఇందుకు కారణం. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితోపాటు ఆయన భార్య, డ్రైవర్, గన్ మెన్, వంటమనిషి కరోనా బారిన పడ్డారు. యాదగిరిరెడ్డి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా, మిగతావారు హోం క్వారంటైన్లో ఉన్నారు. వీరికి కరోనా లక్షణాలు లేకపోయినా, పాజిటివ్ ఫలితాలు రావడంతో హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు.
జనగామ ఎమ్మెల్యేకు కరోనా సోకిన ఘటన నుంచి గులాబీ శ్రేణులు తేరుకోకముందే తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కూడా కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. వారం రోజుల క్రితమే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో బాజిరెడ్డి ప్రైమరీ కాటాక్ట్ అయ్యారు. జనగామ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ రావడంతో బాజిరెడ్డి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. టెస్టుల్లో బాజిరెడ్డికి కరోనా నిర్ధారణ కావడంతో చికిత్స కోసం ఆయన రాజధానికి బయలుదేరారు.
ఇదే దశలో బాజిరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచర, అధికారగణం కూడా హోం క్వారంటైన్ కు వెళ్లడం గమనార్హం. తన నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి వెంట వందకు పైగా సంఖ్యలో వారు పాల్గొనడమే ఇందుకు కారణం. వరుసగా ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడడంతో గులాబీ పార్టీ నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కరోనా భయంతో కారు డ్రైవర్ ను డ్యూటీకి రావద్దని చెప్పి, తన వాహనాన్ని తానే డ్రైవ్ చేసుకుంటున్నట్లు తెలిసింది.