నిబద్ధత గల ప్రభుత్వాధికారులు ఉంటే ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇటువంటి అధికారుల చిత్తశుద్ధి పాలకులకూ మంచి పేరు తీసుకువస్తుంది. అయితే ఈ అంశంలో పాలకులు బ్యూరోక్రాట్లకు స్వేచ్ఛనిస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పే ఘటన ఇది. ప్రతి వ్యవహారాన్నీ రాజకీయ కోణంలో యోచించే పాలకులకు బహుషా ఇటువంటి అధికారుల వ్యవహార తీరు నచ్చకపోవచ్చు, వారి అవసరం ఉండకపోవచ్చు కూడా. కానీ అంతిమంగా ప్రజలకు కష్టం కలుగుతుంది. ఫలితంగా పాలక పార్టీలకూ మున్ముందూ పూడ్చుకోలేని నష్టమూ వాటిల్లుతుంది. పాలకుల రాజకీయ విధానాలను మాత్రమే పట్టుకుని వేలాడకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే బ్యూరోక్రాట్లకు స్ఫూర్తి దాయకం ఈ ఉదంతం. సమాచార శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్, మిత్రుడు వెంకటరమణ చక్కగా వివరించారు. ఇక చదవండి.
ములుగు డివిజనల్ పీ.ఆర్.ఓ గా పనిచేసిన సమయంలో జరిగిన మరో చారిత్రక సంఘటన వేలాది భూ పట్టాల పంపిణీ కార్యక్రమం. దాదాపు కొన్ని దశాబ్దాలుగా భూములను దున్ని, దుక్కి వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ ఆయా భూములపై ఏవిధమైన యాజమాన్య హక్కులు లేకపోవడంవల్ల సరైన పంట రుణాలు లభించక పోవడం, భూ వివాదాలుతదితర సమస్యలు ఆ గ్రామాల నిరుపేద రైతులకు నిత్యకృత్యం.
ములుగు మండలంలోని రామచంద్రాపురం, కోయగూడెం, కొడిశల కుంట, నిమ్మనగర్, పందికుంట, భూపాల్ నగర్, సుకృ తండా, మాన్సింగ్ తండా, దేవనగర్ తదితర 23 గ్రామాలకు చెందిన గిరిజన రైతులు నిరంతరం సమస్యలను ఎదుర్కొనేవారు. తమ భూ సంబంధిత వివాదాలను పరిష్కరించాలని ప్రతీ కలెక్టర్ కూ, ఆర్దీఓ, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకుంటున్నా, దీర్ఘ కాలికంగా ఉన్న ఈ భూ వివాదాలను ఎవరూ పట్టించుకోలేదు.
అయితే ఒకరోజు, అప్పటి కలెక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి ములుగు పర్యటనకు వచ్చిన సందర్బంలో ఆయా గ్రామాల రైతులు ఎప్పటిలాగే తమ సమస్యలను ఏకరువు పెట్టారు. దీంతో వరంగల్ వెళ్లిన అనంతరం కలెక్టర్ తన కార్యాలయంలో ఈ అంశంపై సమావేశమై సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీని ఫలితమే దాదాపు ఎనిమిది వేల ఎకరాలకు సంబంధించి దాదాపు ఆరేడు వేలమంది గిరిజనులకు కొన్ని దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న తమ భూములపై యాజమాన్య పట్టాలు లభించడం. వరంగల్ జిల్లా చరిత్రలో ఎప్పటికీ చరిత్రగా నిలిచిన ఈ అంశం పూర్వాపరాలు పరిశీలిస్తే….
నైజామ్ పరిపాలనలో చివరి రాజైన ఉస్మాన్ అలీ ఖాన్ ఆహార భద్రత కార్యక్రమంలో భాగంగా భూములను సాగు చేసుకొని వచ్చే ఉత్పత్తులలో యాభై శాతం నిజామ్ కు ఇవ్వడం, మిగిలిన దానిని వారు అనుభవంచేలా తన రాజ్యానికి చెందిన వేలాది భూములను తనకు నమ్మకంగా ఉండే వారికి కేటాయించేవారు. అందులో భాగంగానే ములుగు తాలూకా లోని రామచంద్రపురం, మల్లంపల్లి రెవిన్యూ గ్రామాల పరిసరాల్లోని 10,500 ఎకరాల అటవీ భూములను అజీమ్ ఖాన్ అనే వ్యక్తికి నిజామ్ అప్పగించారు. రెవిన్యూ పరి భాషలో ఈ భూములను బిల్ మక్తా భూములుగా పిలుస్తారు. ఈ భూములను కౌలుగా అజీమ్ ఖాన్ అనేక మందికి, ప్రధానంగా గిరిజనులకు కౌలుగా ఇచ్చారు. దీంతో, గిరిజనులు అటవీ ప్రాంతంగా, చెట్లు, పుట్టలతో నిండి ఉన్న ఈ సారవంతమైన ఎర్రమట్టి నేలలను చదును చేసి సాగు చేస్తూ వస్తున్నారు.
అజీమ్ ఖాన్ అనంతరం అయన కుమారుడైన ఉమర్ ఖాన్ కు ఈ భూములపై అధికారం లభించింది. ఇప్పటికే ఈ భూములను ఉమర్ ఖాన్ భూములుగానే స్థానికులు వ్యవహరిస్తారు. ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు లేకపోవడం, బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పరంగా ఏవిధమైన సహాయం అందకపోవడం, భూ సంబంధిత వివాదాలు వచ్చినా అటు అధికారులు, ఇటు పోలీసులు ఏవిధమైన చర్యలు తీసుకోక పోవడం ఉండేది. తద్వారా ఎప్పుడూ భూ వివాదాలు ఈ ఉమర్ ఖాన్ భూముల్లో ఉండేవి. ఇప్పటికీ ఉమర్ ఖాన్, ఆయన వారసులు తమకు ఈ భూములు విక్రయించారని అనేక మంది కాయితాలు తేవడం, ఆ భూములలో ఎన్నో ఏళ్లుగా ఆధారపడ్డ వారికి, కాయితాలు తెచ్చిన వారికి మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.
దీంతో ఈ వివాదాల పరిష్కారానికి ఆ ప్రాంతంలో చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్న తీవ్రవాదులను స్థానిక గిరిజన రైతులు ఆశ్రయించేవారు. సహజంగానే స్థానికులకు మద్దతునివ్వడంతో నక్సల్స్ ప్రభావం గట్టిగానే ఉండేది. ఈ ప్రాంతంలో ఉన్న ఏసు నగర్ వద్ద దాదాపు రూ.40 లక్షల వ్యయంకాగల ఒక కుంటను నిర్మించి 200 ఎకరాలకు సాగు నీరు అందించారని అప్పటి పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇదిలాఉండగా, ఇక రాంచంద్రాపూర్ భూముల విషయానికి వస్తే వరుసగా పన్నెండేండ్లు భూమిపై కాస్తులో ఉంటె ఆ భూమికి పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి అన్న ప్రభుత్వ నిబంధనను ఆధారంగా ఉమర్ ఖాన్ కు చెందిన 8,000 ఎకరాలకు భూములకు సంబంధించి కాస్తులో ఉన్ననిరుపేద గిరిజన రైతులకు శాశ్వత పట్టాలను కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కృషి చేసి ఇప్పించారు. 2003 జనవరి ఒకటవ తేదీన రామచంద్రాపూర్ లో పెద్ద సమావేశం నిర్వహించి అప్పటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఐదు వేలమందికి పైగా గిరిజన, బడుగు,బలహీన వర్గాల వారికీ శాశ్వత పట్టాలను ఇప్పించిన సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.
అయితే గతంలో పేర్కొన్న విధంగా నిబద్దత గల అధికారి ఉంటే వాయిస్ లెస్ నిరుపేదలకు జరిగే మేలు ఎంతో ఉంటుంది. ఈ కోవలోనే నిలిచినా ప్రభాకర్ రెడ్డి ఒక వెంగమ్మ చెరువు, జంపన్న వాగు పై బ్రిడ్జి నిర్మాణం, వరంగల్ జిల్లాలో 14 వేల మంది విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందచేయడం, రేగొండ మండలంలోని సుల్తాన్ పూర్, జగ్గయ్య పేట, గోరి కొత్తపల్లి గ్రామాలలో మరమ్మతులకు నోచుకోని ప్రయివేటు చెరువులు, కుంటలను ఉపాధి హామీలో చేర్చి రిపేర్లు చేయించారు. ఈ సంఘటనలన్నీ సామాజిక, ఆర్థిక కోణంలో స్థానికంగా గణనీయ మార్పుకు నాందిగా నిలిచాయి. ఈ స్ఫూర్తిదాయకమైన విజయ గాధలను పీ.ఆర్.ఓ గా ప్రజలకు అందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నాను.
✍️ కన్నెకంటి వెంకట రమణ,
డిప్యూటీ డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాల శాఖ