తెలంగాణాలోని మంచిర్యాల జిల్లాకు చెందిన ముగ్గురు గంజాయి స్మగ్లర్లు… కరోనా కల్లోల పరిణామాల్లోనూ తమ కార్యకలాపాలకు స్వీయ ‘లాక్ డౌన్’ విధించుకోలేదు. ఎప్పటిలాగే స్మగ్లింగ్ ద్వారా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆశ పడ్డారు. ఆంధప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చేరుకున్నారు. స్థానిక బేరగాళ్లతో లావాదేవీలు మాట్లాడుకుని గంజాయిని మూటగట్టుకుని బయలుదేరారు. విధి వక్రీకరించింది. మార్గమధ్యంలోనే చట్టి సమీపాన చింతూరు పోలీసుల తనిఖీలో ఈ ముగ్గురు స్మగ్లర్లు గత ఆదివారం గంజాయితో పట్టుబడ్డారు.
కేసు విచారణ, దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతర ప్రక్రియ మేరకు నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడానికి, రంపచోడవరం బయలుదేరేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కానీ పోలీసులకు ఎక్కడో కాస్త సంశయం కలిగింది. ఎందుకైనా మంచిదని నిందితులైన ముగ్గురు గంజాయి స్మగ్లర్లకు ‘కరోనా’ టెస్టులు చేయించారు. ముగ్గురిలో ఒకరికి కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. క్రాస్ చెక్ చేసుకునేందుకు మరోసారి వైద్య పరీక్షలు చేయించారు. మంగళవారం నాటి తాజా నివేదికల్లోనూ మళ్లీ పాజిటివ్ రిజల్టే వచ్చింది. కరోనా సోకిన స్మగ్లర్ ను రాజమండ్రి సమీపంలోని బొంగూరు ఐసొలేషన్ కేంద్రానికి తరలిస్తున్నారు. కానీ…?
ఈ ముగ్గురు గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు ఇప్పుడు హైరానా పడుతున్నారు. నేర ఘటనలను నిలువరించేందుకు విధినిర్వహణలో పాల్గొన్న పాపానికి ప్రస్తుతం ‘క్వారంటైన్’కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పోలీసులు ఆవేదన చెందుతున్నారు. ఏ స్మగ్లర్ వద్ద కరోనా పొంచి ఉందో, మరే ఇతర నేరాగాళ్ల వద్ద వైరస్ ఎదురు చూస్తున్నదో తెలియక పోలీసులు ఆందోళన చెందుతున్న ఘటన ఇది. ఈ ఉదంతం తూర్పు గోదావరి జిల్లా పోలీసు వర్గాల్లో తీవ్ర కలవరానికి కారణమైనట్లు సమాచారం.