తెలంగాణా రాజధానిలో కరోనా వైరస్ తెలుగు మీడియా ప్రతినిధులను వెంటాడుతోంది. గడచిన మూడు రోజుల్లోనే మూడు మీడియా సంస్థల్లో పనిచేసే ముగ్గురికి కరోనా సోకడం గమనార్హం. హైదరాబాద్ కేంద్రంగా సాక్షి పత్రికలో పనిచేసే జనరల్ బ్యూరోలోని ఓ జర్నలిస్టుకు, అతని కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయా జర్నలిస్టు కుటుంబం చికిత్స తీసుకుంటున్నది.
టీవీ 5 క్రైం రిపోర్టర్ గా పనిచేసే మనోజ్ అనే యువ జర్నలిస్టును కరోనా బలి తీసుకున్న సంగతి తెలిసిందే. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన రెండు రోజుల వ్యవధిలోనే మనోజ్ తుదిశ్యాస విడిచారు. అయితే మనోజ్ కు గాంధీ ఆసుపత్రిలో చేసిన చికిత్స తీరుపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. తనకు కనీసం ఆక్సిజన్ కూడా పెట్టలేని మనోజ్ తన స్నేహితులతో, సన్నిహితులతో చాట్ చేసినట్లు ఈ వార్తల సారాంశం. మనోజ్ మరణించిన తీరు జర్నలిస్టును తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తోంది.
మనోజ్ ను కరోనా కబలించిన విషాద ఘటనను జర్నలిస్టులు మరువకముందే టీవీ9 హైదరాబాద్ ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు తాజా సమాచారం. దీంతో టీవీ9 కార్యాలయంలోని ఓ ఫ్లోర్ మొత్తాన్ని ఖాళీ చేయించి శానిటైజ్ చేస్తున్నట్లు తెలిసింది. తమ సహచర ఉద్యోగి ఒకరికి కరోనా సోకడం నిజమేనని టీవీ 9 కార్యాలయ వర్గాలు కూడా స్పష్టం చేశాయి.
మనోజ్ మరణాంతర పరిణామాలు, తాజా వార్తల సారాంశం జర్నలిస్టులు మరింత జాగ్రత్తగా ఉంటూ విధులు నిర్వహించాల్సిన అవసరాన్ని పదే పదే గుర్తు చేస్తున్నాయి.