ఈ వార్తా కథనం చదివాక, దిగువన గల బదిలీ ఉత్తర్వు కాపీని ఓసారి పరిశీలనగా చూడండి. మొత్తం 62 మంది పోలీసుల బదిలీకి సంబంధించిన ఉత్తర్వు కాపీ ఇది. బదిలీకి గురైన వారిలో 14 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 48 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరందరినీ మూకుమ్మడిగా బదిలీ చేస్తూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి నిన్న ఉత్తర్వు జారీ చేశారు.
అయితే ఏంటి..? పోలీసులన్నాక బదిలీలు ఉండవా? ఇందులో ఏమైనా ప్రత్యేక ఉందా? అని ప్రశ్నిస్తే… ఖచ్చితంగా గమనించాల్సిన ప్రత్యేకతే ఉంది. నాలుగు జిల్లాలకు చెందిన మొత్తం 62 మంది పోలీసులను ఆయా జిల్లాలకు కాకుండా పక్కనే ఉన్న మరో జిల్లాకు బదిలీ చేయడమే అసలు ప్రత్యేకత. అంతేకాదు అనేక పోలీస్ స్టేషన్లకు చెందిన ఆయా పోలీసులను, పొరుగున గల మరో జిల్లాలోని కేవలం ఆరు పోలీస్ స్టేషన్లకు మాత్రమే బదిలీ చేయడం గమనించాల్సిన అంశమే.
ఈ ఆరు పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయంటే… మహారాష్ట్ర సరిహద్దుల్లో గల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉండడమే బదిలీ ఉత్తర్వులోని అసలు ప్రత్యేకత. కొయ్యూరు, కాటారం, మహాదేవపూర్, పలిమెల, అడవి ముత్తారం, కాళేశ్వరం పోలీస్ స్టేష్లన్లకు మాత్రమే 62 మంది పోలీసులను ఆయా ఉత్తర్వు ద్వారా బదిలీ చేశారు. అసలు వీళ్లంతా ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారంటే… వరంగల్, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లలో, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్నారు.
వాళ్లు పనిచేస్తున్న జిల్లాల్లోని మరే ఇతర స్టేషన్లకు కాకుండా, ఎక్కడో మహారాష్ట్ర సరిహద్దుల్లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల అటవీ ప్రాంత స్టేషన్లకు బదిలీ చేయడమేంటి? అని ఆశ్చర్యపోతూ ప్రశ్నించకండి. బదిలీ ఉత్తర్వులో మాత్రం ‘అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్’ అని మాత్రమే ఉంది. సర్కారు కొలువుల్లో గల వారిని మరే ఇతర కారణాల వల్ల బదిలీ చేసినా, ఉత్తర్వు కాపీల్లో ‘పరిపాలనా సౌలభ్యం’లో భాగంగా అని మాత్రమే ఉండడం రివాజే. కరోనా కల్లోల పరిణామాల్లోనూ ఈ బదిలీలు జరగడమే మరో ప్రత్యేకత. ఇంతకీ అసలు విషయమేమిటంటే…?
తెలంగాణా రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకే వీరందరినీ ప్రత్యేకంగా అటవీ ప్రాంత ఠాణాలకు బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు అంతగా ఆగ్రహం కలిగించే పని వీళ్లేం చేశారూ…? అంటే మాత్రం బదిలీ ఉత్తర్వుల్లో ఉండదు. పోస్టింగును బట్టి మనమే అర్థం చేసుకోవాలి… విషయం మీకు అర్థమైనట్లే కదా!
UPDATE:
కాగా ts29 ఈ వార్తా కథనాన్ని ప్రచురించిన కొద్ది నిమిషాల్లోనే పోలీసు వర్గాలు స్పందించడం విశేషం. ఆయా 62 మందిని అటవీ ప్రాంతాలకు ఎందుకు బదిలీ చేశారనే అంశంపై ఓ పోలీసు ఉద్యోగి వాట్సాప్ ద్వారా పంపిన పోస్టును దిగువన చదవండి.