కరోనా మహమ్మారి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని(సీఎంవో) కూడా తాకింది. రాజధానిలోని రసూల్ పురాలో గల మెట్రో రైల్ భవన్ లో గల సీఎంవో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది.
ఈ మధ్యనే మహారాష్ట్ర నుంచి ఆయా ఉద్యోగి కుమారుడు హైదరాబాద్ కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అతని నుంచే సీఎంవో ఉద్యోగికి కరోనా సోకినట్లు భావిస్తున్నారు. దీంతో ఆఫీసుకు ఎవరూ రావద్దని సీఎంవోలోని అన్ని శాఖల ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. కొంతకాలం పాటు సీఎంవో పూర్తిగా బంద్ కానుంది.
ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 30 మంది నుంచి శాంపిళ్లను ఛెస్ట్ హాస్పిటల్ వైద్య సిబ్బంది సేకరించగా, వీరిలో సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సీఎం ఆఫీసును కరోనా వైరస్ తాకడంతో ఉద్యోగవర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇదే దశలో సీఎం ఆఫీసును మొత్తంగా శానిటైజేషన్ చేస్తున్నట్లు తెలిసింది.
తాజా పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ కాలుష్య నియంత్రణ బోర్డు కార్యాలయం నుంచి తన విధులు నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు హైదరాబాద్లో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతుండటంతో నగర వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.