తెలుగు మీడియాలో కరోనా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఓ ప్రముఖ పత్రికకు చెందిన హైదరాబాద్ జనరల్ బ్యూరోలోని ఓ జర్నలిస్టుకు, అతని కుటుంబానికి కరోనా సోకినట్లు తాజా వార్తల సారాంశం. రాజధానిలోని కంటైన్మెంట్ ఏరియాలోనే నివాసముండే ఆ పత్రిక జర్నలిస్టు పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఆఫీసుకు సెలవు పెట్టి వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు తెలిసింది. అతనితోపాటు కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడగా, చికిత్స కోసం వారిని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు జర్నలిస్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ పత్రికా కార్యాలయంలో దినసరి రెండుసార్లు ఫ్లోర్ యావత్తూ శానిటైజేషన్ చేస్తున్నట్లు అక్కడి ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.
అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన మరో జర్నలిస్టు కూడా కరోనా బారిన పడినట్లు తెలిసింది. హైదరాబాద్ లోనే ఈ జర్నలిస్టు కూడా విధులు నిర్వహిస్తున్నారు. తాజా వార్తల నేపథ్యంలో కరోనాకు సంబంధించి జర్నలిస్టులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాల్సిన అవశ్యకతను గుర్తు చేస్తోంది.