‘సినిమా ‘కత’ వేరు… విప్లవ గాథ వేరు. సినిమా కథ కల్పితం. విప్లవ గాథ పోరాటం. సినిమా సీన్ తెరమీద తైతక్కలాడుతుంది. విప్లవం తాడిత, పీడిత ప్రజలకోసం అలుపెరుగని పోరాటం చేస్తుంది. సమసమాజ స్థాపనకోసం వీరోచిత యుద్ధం చేస్తుంది. ఈ పోరాటంలో అనేక మంది విప్లవ యోధులు ఆత్మర్పణం కూడా చేస్తుంటారు. విప్లవ పోరాటంలో ఎన్నో పార్టీలు, మరెన్నో సంస్థలు. సైద్ధాంతిక దారులు వేరైనా అందరూ పోరాడేది ‘విప్లవం’ కోసమే… అంటే ‘మార్పు’ కోసమే. కానీ విప్లవ పోరాటం కూడా అప్పుడప్పుడు సినిమాలకు ముడిసరుకుగా మారుతుంది. ఎక్కడా లేని ఆసక్తిని కలిగిస్తుంది.
ఈనాడు అధినేత రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై 1991లో ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ పేరుతో పక్కా కమర్షియల్ అంశాలను జోడించి తీసిన సినిమా అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ‘విప్లవం‘ అంటే తమరి సినిమాలో చూపించినట్లు హోరెత్తించే మ్యూజిక్, అందుకు అనుగుణంగా చేసే డాన్సుల తైతక్కలు కావనే సారాంశంతో అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీంతో అనేక సినిమా థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించడానికే వాటి యాజమన్యాలు బెంబేలెత్తాయి. మొత్తంగా ఆ సినిమాకు రామోజీ ఆశించిన ‘లాభాలు’ రాకపోగా, ఓ రకంగా ఆయన ‘టెన్షన్’ను ఎదుర్కున్నారంటే అతిశయోక్తి కాదు. అప్పుడెప్పుడో రామోజీరావు తీసిన విప్లవ సినిమా ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ ప్రస్తావన ఇప్పుడు దేనికంటే..?
‘విరాటపర్వం’ పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తీస్తున్న సినిమా పోస్టర్లు ‘విప్లవ’ అంశాల, పోరాటాల గురించి మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి. మొన్నా మధ్య హీరోయిన్ సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. విప్లవోద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు చెందిన ఓ భారీ స్థూపం వద్ద కూర్చుని ఉన్న సాయిపల్లవి పోస్టర్ సినీ ప్రేక్షకుల్లోనే కాదు, విప్లవాభిమానుల్లోనూ చర్చకు దారి తీసింది.
మరో సినీనటి ప్రియమణి పుట్టిన రోజు సందర్భంగా నిన్న తాజాగా విడుదల చేసిన ఇంకో పోస్టర్ కూడా ఇదే తరహా ఆసక్తికి కారణమైంది. ‘కామ్రేడ్ భారతక్కను చూశారా?’ అంటూ ప్రచురితమైన వార్తలు సినిమా నేపథ్యమేంటో స్పష్టం చేస్తున్నాయి. అంతేగాక ఇదే సినిమాలో దగ్గుబాటి రానా కూడా ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. అతని పాత్రకు సంబంధించిన వీడియోలు, పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే అప్ లోడయ్యాయి.
ఇక అసలు విషయంలోకి వస్తే… ‘విప్లవ’ నేపథ్యాన్ని సినిమాలకు ముడిసరుకుగా మార్చుకోవడం కొత్త కాకపోవచ్చు. ఇటువంటి సినిమాల చిత్రీకరణల అంశంలో మాదాల రంగారావు నుంచి ఆర్ నారాయణమూర్తి వరకు అనేక మంది తీసిన విప్లవ సినిమాలు చాలా వరకు ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. అనేక సినిమాలకు కాసులు రాకపోయినా, వారు తీసిన విధానాన్ని ఎవరూ వేలెత్తి చూపిన దాఖలాలు లేవు. ‘కుబుసం’ వంటి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది, కానీ నిర్మాత ఆర్థికంగా చేతులు కాల్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. విప్లవ నేపథ్యం ఆధారంగా అప్పట్లో రామోజీ తీసిన ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ తీవ్ర వివాదాస్పదమైంది.
ఈ నేపథ్యంలోనే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మరికొందరితో కలిసి తీస్తున్న ‘విరాటపర్వం’ సినిమా విప్లవోద్యమ నేపథ్యంగానే ప్రస్ఫుటమవుతోంది. ఇందులో రానా, సాయిపల్లవిల పాత్రలు ఏమిటి? మధ్యలో భారతక్క ఎవరు? ప్రస్తుత పరిస్థితుల్లో విప్లవ అంశాన్నే సినీ నిర్మాతలు ఎందుకు కథగా ఎంచుకున్నట్లు? అనే ప్రశ్నలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
మొత్తంగా ‘విరాటపర్వం’ టైటిల్ నుంచి సాయిపల్లవి కూర్చున్న స్మారక స్థూపం వరకు చెబుతున్న సంగతులేమిటి? ప్రియమణి పోషిస్తున్న భారతక్క పాత్ర ఎవరిది? పీపుల్స్ వార్ సంస్థలో పనిచేసిన ఆ భారతక్క పాత్రనే ప్రియమణి పోషిస్తున్నారా? దగ్గుబాటు రానా భారతక్క భర్త రామకృష్ణ పాత్రను తలపిస్తున్నారా? కాస్త ‘కొయ్యూరు’ ఎన్కౌంటర్ నేతల నేపథ్యాన్నీ గుర్తు చేస్తున్నాయా? ఏంటీ ‘విరాటపర్వం’ సినిమా కథ? కల్పితమా? విప్లవోద్యమంలో అసువులు బాసిన వాస్తవిక పాత్రల చుట్టూ అల్లిన కథనమా? ఎవరీ భారతక్క… ఏమా అసలు కథ?
(తరువాత కథనంలో… కొద్ది సేపట్లోనే…)