‘ఆరేళ్లలో మహా భాగ్యం… రాష్ట్రంలో వెలుగు పూలు… కోటి ఎకరాలకు సాగునీరు… ఆసరా అభయం… దేశానికే ఆదర్శంగా నిలిచిన పథకాలు మరెన్నో…’
భజన వాక్యాలే అనుకోండి, ప్రభువులవారి కీర్తన నినాదాలుగానే భావించండి. కానీ వర్ణించిన తీరు, వల్లించిన పద్ధతి బాగుంది కదా? చదువుతున్న కొద్దీ చదవాలనిపిస్తోంది కదూ? ‘తిరుగు లేని సిక్సర్’ శీర్షికన తెలంగాణా సీఎం కేసీఆర్ ఆరేళ్ల పాలనపై ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ప్రచురించిన ఆసక్తికర వార్తా కథనంలోని కొన్ని పాయింట్లివి. ఆరేళ్ల తెలంగాణా ప్రగతి యాత్ర, స్వయం పాలనలో తనదైన ముద్ర, దేశానికి దిక్సూచిగా పథకాల మంత్ర అంటూ మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీలో యతి, ప్రాసల విన్యాసపు వ్యాఖ్యలతో, వాక్యాలతో తన పాఠకులకు ఆంధ్రజ్యోతి అందించిన వార్తా కథనంలోని ‘ఇంట్రో’ మాత్రమే ఇది. ‘ఉద్యమ నినాదంలో నియామకాలే మిగిలాయి!’ అంటూ ఏడో పేజీని మొత్తం కేసీఆర్ పాలనను ఆంధ్రజ్యోతి ఆకాశానికెత్తుతూ, సాహో… కేసీఆర్ సార్ అంటూ కీర్తించి, ముక్తాయించిన విశేషమిది.
అదేమిటీ…? ఈ మధ్యనే కదా ‘కేసీఆర్ చెప్పిండంటే ‘ఖతర్నాక్’గా ఉంటది. ప్రభుత్వం చూడడం లేదని అనుకోవద్దు. సరైన సమయంలో సరైన చర్య ఉంటుంది’ అని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో పరోక్షంగా ఆంధ్రజ్యోతి యజమానికి హెచ్చరిక జారీ చేశారు కదా…? కరోనా నియంత్రణలో వైద్యుల రక్షణ, పీపీఈ కిట్ల అంశాలకు సంబంధించి ఆంధ్రజ్యోతి రాసిన రాతలపై కేసీఆర్ ఆగ్రహించారు కదా? ఇటువంటి రాతలకు కరోనా సోకాలని బాహాటంగానే శపించారు కదా? అని పాత సంగతులను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోకండి. ఎందుకంటే…?
రాజకీయాల్లోనేకాదు పత్రికా రంగ ప్రముఖులకు సైతం పాలకులతో శాశ్వత శత్రుత్వం, మిత్రుత్వం ఉండకపోవచ్చు. తెలంగాణా సీఎం కేసీఆర్, వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్కేల మధ్య స్నేహం కుదిరిందని, వాళ్లిద్దరూ తాజాగా భాయీ, భాయీ అంటూ ఆ మధ్య ts29 రాసిన వార్తా కథనం గుర్తుంది కదా! బెదిరింపులకు ఆంధ్రజ్యోతి భయపడదంటూ ఆర్కే తన ‘కొత్తపలుకు’లో రాసుకున్న కొద్ది రోజులకే ఆంధ్రజ్యోతి తన రాతల్లో వైఖరిని మార్చుకున్న వైనాన్ని ts29 రాసిన వార్తా కథనంలో ప్రస్తావించడం గమనార్హం. ఆర్థిక అవసరాలా? మరేవైనా ఇతర కారణాలా? జగన్ తో రాజీలేని వైరమా? కారణాలు ఏవైనా కావచ్చు. కానీ ఆంధ్రజ్యోతి రాతలు ‘అండర్ కంట్రోల్ ఆఫ్ కేసీఆర్ సర్’ అంతే…! కాదు… కాదు… మీకేమీ తెలియదు… ఆంధ్రజ్యోతిని తెలంగాణా వరకు ‘మై హోం’ సంస్థ టేకోవర్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది కదా? ఇది అందులో భాగం కాబోలు అంటారా? ఏమో మరి… ఆ ప్రచారంపై ఇప్పటికైతే ఇంకా స్పష్టత లేదు. కానీ…
మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే ‘కేసీఆర్ తిరుగులేని సిక్సర్… ఆంధ్రజ్యోతి అండర్ కంట్రోల్’ అనేదే అసలు పాయింట్. నేటి తాజా సంచిక రాతలకు ఇదే ప్రామాణికంగా ఆంధ్రజ్యోతి పాఠక వర్గాలే అంచనా వేస్తున్నాయి. కేసీఆర్ ఆరేళ్ల పాలనకు సంబంధించి ఆంధ్రజ్యోతి కీర్తన రాతలకు సంబంధించిన ‘ఈ పేపర్’ క్లిప్పింగులను ఇక్కడ ఆధారంగా చూపే అవకాశాలకు తాజా నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. కాబట్టి ఆంధ్రజ్యోతి రాతలను ఈ పేపర్ లోగాని, ప్రింట్ సంచికలోగాని చదివి మీరే ఆస్వాదించండి.