తెలంగాణా సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశిస్తే, ఆ పరిణామం వారసత్వ యుద్ధానికి దారి తీస్తుందా? నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత గెలిస్తే కేసీఆర్ కుటుంబ వారసత్వ రాజకీయాల్లో కొత్త కోణపు ఆవిష్కరణకు ఆమె హేతువవుతారా? గత పార్లమెంట్ ఎన్నికల్లో తన తండ్రి కేసీఆర్ మద్ధతు ఉన్నప్పటికీ, నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని నిలుపుకోవడంలో కవిత వైఫల్యం చెందారా? గత పార్లమెంట్ ఎన్నికల చేదు అనుభవం నేపథ్యంలో, ఎమ్మెల్సీ ఎన్నిక కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో క్యాంపు రాజకీయాలు నిర్వహించడం ద్వారా కవిత విమర్శల పాలవుతున్నారా? ఎమ్మెల్సీగా కవిత గెలుపు నల్లేరుపై నడకగానే భావిస్తున్నప్పటికీ, ‘ఆకర్ష్’ రాజకీయాలు నిర్వహించడం దేనికి సంకేతం?
ఇటువంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ ‘ది వైర్’ సంచలన రాజకీయ కథనాన్ని ప్రచురించింది. కవిత ఎమ్మెల్సీగా గెలుపొందిన అనంతరం తండ్రి ద్వారా ముఖ్య పదవిని ఆశించే అవకాశాలు లేకపోలేదని కూడా ఈ కథనంలో పేర్కొంది. మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తరహాలో కవిత సైతం ‘పవర్’ రాజకీయాలకు కేంద్రబిందువు కావచ్చని, ఫలితంగా వారసత్వ రాజకీయ యుద్ధానికి పరిణామాలు దారి తీయవచ్చంటూ ‘ది వైర్’ తన వార్తా కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఈ కథనం తెలంగాణా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారడం విశేషం.
‘ది వైర్’ పూర్తి కథనాన్ని ఈ లింక్ ద్వారా చదవండి: KCR’s Daughter’s Entry in State Politics May Spark Succession War: Analysts