తీవ్రవాద ఉద్యమంలో ఇదో అరుదైన ఘటన. దశాబ్ధాల నక్సల్ ఉద్యమ చరిత్రలో ఇటువంటి ఘటనలు సాక్షాత్కరించడం విశేషమే. సాధారణంగా నక్సలైట్లు ఎటువంటి పరిస్థితుల్లో లొంగిపోతారు? ముఖ్యంగా మూడు ప్రధాన కారణాల వల్ల అజ్ఞాత జీవితం గడిపే నక్సల్స్ లొంగుబాటలో పయనిస్తారు.
అందులో మొదటిది అనారోగ్యం. తాము నమ్మిన సిద్ధాంతాలపై నమ్మకం సడలనప్పటికీ, ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో మాత్రమే నక్సల్స్ లొంగుబాటను ఎంచుకుంటారు. ఇక రెండోది కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు జనజీవన స్రవంతిలో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేస్తుంటారు. మిగిలిన మూడోది పార్టీలోని నేతలతో విభేదాలు పొడసూపిన సమయంలోనూ లొంగుబాటను అనివార్యంగా ఆశ్రయిస్తారు.
ఇటువంటి సమయాల్లో, సందర్భాల్లో లొంగిపోయిన నక్సల్స్ కు వారి తలలపై గల నగదు రివార్డులను ప్రభుత్వం వారికే ఇస్తుందా? జనజీవన స్రవంతిలో బతికేందుకు ఆర్థిక సాయం చేస్తుందా? వంటి పునరావాస ప్రశ్నలను వదిలేస్తే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి గ్రామస్తులు మావోయిస్టు పార్టీకి చెందిన అరుగురు నక్సలైట్లను లొంగుబాటలోకి తీసుకువచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. లొంగిపోయినవారందరూ గ్రామ కమిటీ సభ్యులుగా పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పోలీసు శాఖ విడుదల చేసిన ప్రకటన ఉన్నది ఉన్నట్లుగా దిగువన చదవవచ్చు.
చర్ల పోలీసు వారి ఎదుట నిషేధిత మావోయిస్ట్ పార్టీ కమిటీ సభ్యులను సరెండర్ చేయించిన కుర్నాపల్లి గ్రామస్థులు:
ఈ రోజు ది. 31.05.2020 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో గల కుర్నపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు నిషేధిత మావోయిస్ట్ పార్టీ కమిటీ సభ్యులను గ్రామస్థులు అందరూ కలిసి స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట సరెండర్ చేయించారు. గ్రామంలోని ప్రతి ఇంటినుండి ఒక వ్యక్తి చొప్పున దాదాపు 200 మంది వ్యక్తులు పోలీసు స్టేషన్ కు వచ్చి వారిని సరెండర్ చేయించడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల క్రితం నిషేధిత మావోయిస్ట్ పార్టీ వారు కుర్నపల్లి గ్రామంలోకి వచ్చి, ఆ గ్రామస్థులు మావోయిస్ట్ పార్టీ వారికి సహకరించడం లేదనే కారణంతో విచక్షణా రహితంగా గ్రామస్తులను కొట్టగా, ఆ గ్రామానికి చెందిన ఇర్పా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. మావోయిస్ట్ పార్టీ వారు ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులను బలవంతంగా నిషేధ మావోయిస్ట్ పార్టీ కమిటీ గా ఎంపికచేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులు అయిన ఇర్పా రామారావు మరియు ఇర్ప సత్తిబాబు అనే ఇద్దరు వ్యక్తులను పోలీసు వారు అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరు పరచడం జరిగింది.
గ్రామస్తులు అందరూ కలిసి ఇక మీద నిషేధిత మావోయిస్ట్ పార్టీ వారికి సహకరించకూడదని నిర్ణయించుకుని, మిగిలిన నిషేధిత మావోయిస్ట్ పార్టీ కమిటీ సభ్యులైన 1)కోరం నాగేశ్వర్రావు s/o దారయ్య, 45 సం, 2)కొమరం రమేష్ s/o late రామయ్య, 20 సం, 3)సోందే రమేష్ s/o అర్జయ్య, 44 సం, 4)కోరం సత్యం s/o late పుల్లయ్య, 40 సం, 5)ఇర్పా వెంకటేశ్వర్లు s/o late దేవయ్య, 35 సం మరియు 6)వాగే కన్నారావు s/o సర్వేశ్వరరావు, 28 సం అనే వారిని చెర్ల పోలీసు స్టేషన్ నందు ఏఎస్పి గారి ఎదుట సరెండర్ చేయించడం జరిగింది. ఇక మీదట నిషేధిత మావోయిస్ట్ పార్టీ వారికి సహకరించేది లేదని గ్రామస్తులంతా స్వచ్ఛందంగా తీర్మానం చేసుకోవడం జరిగింది.