సోషల్ మీడియా ప్రాధాన్యత పెరిగాక పలువురి రాతల్లోని సృజనాత్మకతకు ప్రాచుర్యం బాగా పెరిగిందనే చెప్పాలి. అతి తక్కువ వాక్యాల కథనంలోనే సమకాలీన, వర్తమాన అంశాలను సూటిగా తాకే విధంగా ‘పంచ్’లు భలే పేలుస్తున్నారు నెటిజన్లు. దిగువగల ఓ సోషల్ మీడియా పోస్ట్ ఆ కోవకు చెందిందే. సాంకేతిక అంశాల కారణంగా వ్యక్తుల పేర్లు లేకుండా స్వేచ్ఛతో ఎడిట్ చేసిన ఈ చిన్ని కథనాన్ని ఓసారి చదవండి. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది మరి. ఆసాంతం చదివాక ‘పంచ్’ భలే పేలిందని మీరూ అంగీకరించక తప్పదు.
ఓ యువనేత తన ప్రసంగంలో ఇలా చెబుతున్నాడు..
ఒక వ్యక్తి తన ముగ్గురు కొడుకులకు తలా 100 రూపాయలు ఇచ్చి ఈ డబ్బుతో ఇల్లు పూర్తిగా నిండిపోయే వస్తువు తెమ్మని చెప్పాడు.
మొదటివాడు గడ్డి తెచ్చి పరిచాడు. అయినా ఇల్లు నిండలేదు.
రెండవ వాడు దూది తెచ్చి పరిచాడు. అయినా ఇల్లు నిండలేదు.
మూడవ వాడు ఒక రూపాయితో ఓ కొవ్వొత్తి తెచ్చి వెలిగించాడు. ఇల్లు మొత్తం వెలుతురుతో నిండిపోయింది.
ఆ తర్వాత యువనేత చెప్పాడు మన ప్రాంత పరిపాలకుడు ఆ మూడో కొడుకులాంటోడు. ఏ రోజయితే మన ప్రాంత రాజకీయాల్లోకి ఆయన వచ్చాడో, ఆ రోజు నుంచి మన ప్రాంతం వెలుగుతో కళ …. కళలాడిపోతోంది. అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్నది.
అప్పుడే… వెనుక నుంచి ఓ మాట వినిపించింది.
‘అన్నా… అంతా బాగానే ఉందిగాని, మిగతా 99 రూపాయిలు ఎక్కడున్నాయి….?’
అప్పుడు యువనేత ఇలా అన్నాడు..
ప్రశ్నిస్తున్న ఆ ….ద్రోహిని తరిమి కొట్టండి.