‘సౌదీలోని ఓ సూపర్ మార్కెట్ నుంచి వినియోగదారులను కాకులు బయటకు రానివ్వడం లేదు. ప్రపంచం అంతానికి ఇది ఆరంభమా?’
దిగువన గల ఇంగ్లీషు భాషలోని ట్వీట్ సారాంశం ఇంతే కదా? ట్రాన్స్ లేషన్లో ఏదేని లోపం ఉన్నా, భావం మాత్రం అంతే. ఇంగ్లీషులో ఆయనెవరో రూప్ దరక్ హిందూ అనే పేరుగల వ్యక్తి ట్వీటింది రెండు లైన్ల వాక్యాలే… కానీ,
ఇక తెలుగులోకి ఈ ట్వీట్ వచ్చేసరికి ‘కాకి’గోల ఎలా మారిందో తెలుసా? ‘చిరిగి చేటంత’ అంటారు కదా! అంతలా మారిందన్నమాట. ఎలా అంటే…?
‘కాకులు సౌదీలో ఓ సూపర్ మార్కెట్ నుంచి జనాల్ని బయటకు రానివ్వడం లేదు.
మొన్న జైపూర్ లో మిడతల దండు,
ఇవ్వాల సౌదీ అరేబియాలో కాకుల దండు,
చూస్తుంటే అర్థం కావడం లేదు.
ఈ భూగోళంలో ఇంకా ఎన్ని వింతలు చూస్తామో?
ఈ వీడియో ఘటన అసలు అర్థం ‘కాకి గోల’గా మారిపోయి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ అసలు విషయం ఏంటో తెలుసా?
అసలు ఈ కాకి గోల వీడియోనే సౌదీకి సంబంధించింది కాదు. అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఘటనగా ‘ఆల్ట్ న్యూస్’ ఫ్యాక్ట్ చెక్ ద్వారా నివేదించింది. గత జనవరి 24వ తేదీన టెక్సాస్ లోని ఫోర్ట్ వర్త్ శివారు బర్లెసన్ లో ఇటువంటి సంఘటన జరిగిందని పేర్కొంది. కేంబ్రిడ్జి డిక్షనరీ నిర్వచనం ప్రకారం భారీ సంఖ్యలో కాకులు గుమిగూడి ప్రవర్తించే ఈ తీరును ‘గొణుగుడు’ అంటారు. ఇటువంటి సందర్భాల్లో ఇలా పక్షులన్నీ కలిసి ఎగురుతుంటాయని, తద్వారా ఎగిరే దిశను మార్చుకుంటాయన్నది కేంబ్రిడ్జి డిక్షనరీ నిర్వచనపు సారాంశం.
ఇక ‘కాకి’గోల వీడియోను ఇక్కడ గల ట్వీట్ లో చూసేయండి.