కరోనా వ్యాధి తీవ్రత కంటే పాలకులు విస్మరించిన వలస కార్మికుల వెతలు చరిత్ర విస్మరించలేని వాస్తవంగా చిరస్థాయిగా నిలిచిపోతాయి.
దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన పాలకులు ఈ దేశంలో వలస కార్మికులు ఉన్నారని, వారి గురించి ఆలోచన చేయాలనే విషయాన్ని విస్మరించారు.
పలు దేశాల్లో చిక్కుకుపోయిన భాగ్యవంతులను తిరిగి దేశానికి రప్పించేందుకు అన్ని స్థాయిల్లోనూ అన్ని ప్రభుత్వాలు కృషి చేశాయి. కానీ స్వదేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికుల గురించి పాలకులు ఒక్క క్షణం ఆలోచించిన దాఖలాలు లేవు.
ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంపై ఉమ్మేస్తూ వలస కార్మికులు పిల్లలతో సహా రోడ్డున పడ్డారు. వందలు, వేల కిలోమీటర్ల దూరం కాలికి చెప్పులు లేకుండా, తాగేందుకు మంచినీళ్ళు లేకుండా ఎండకు ఎండుతూ, పోలీసుల లాఠీలను తట్టుకుంటూ బడుగు జీవులు బతుకు బండి లాగించారు. వీరిలో కొందరు ఇంటికి చేరారు. కొందరు కాటికి చేరారు. ఈ ప్రహసనం మొత్తం నిస్సందేహంగా పాలకుల వైఫల్యమే.
లాక్ డౌన్ ప్రకటించిన పాలకులు వలస కార్మికులకు ఆశ్రయం కల్పించాలనే కనీస బాధ్యత విస్మరించారు. ‘ఎక్కడివారు అక్కడే’ అని గొప్పగా చెప్పుకున్న పాలకులు ఎక్కడి కార్మికులకు అక్కడే బస ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు, బాధ్యతారాహిత్యం. పాలకుల్లో మానవత్వం కొరవడిందని చెప్పడానికి ఈ కోవిడ్ ఉదంతం సరిపోతుంది.
నెలరోజుల తర్వాత హడావిడిగా కళ్ళు తెరిచిన పాలకులు వలస కార్మికుల కోసం కంటితుడుపుగా ప్రత్యేక రైళ్ళు నడిపినా నిస్సిగ్గుగా కార్మికులనుండి చార్జీలు వసూలు చేశారు. ఈ ఖర్చులు కేంద్రం భరించాలా? రాష్ట్రాలు భరించాలా? అంటూ మరో నిస్సిగ్గు చర్చ లేపారు.
అయితే ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవాల్సి ఉంది. వలస కార్మికులను గుర్తించి, వారి నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకుని వారికి పనులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ పనులకోసం ఈ కార్మికులు పుట్టిన ఊరు వదిలేసి సుదూర ప్రాంతాలకు వెళుతున్నారో గుర్తించి ఆయా పనులు వారి గ్రామాల్లోనో, సమీప ప్రాంతాల్లోనో కల్పించాల్సి ఉంది.
వలసలు నిలువరించడం పాలకుల కనీస బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే, ఇప్పటికి కూడా గుర్తించకపోతే భావితరాలు పాలకులను క్షమించవు.
✍️ గోపి దారా