‘శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు’ అంటుంటారు. కరోనా దరిద్రానికి వ్యాపార ఉపాయం కనిపెట్టాడు కేరళలోని ఓ ఫొటో స్టూడియో యజమాని. కరోనా వైరస్ బారిన పడకుండా ముఖానికి మాస్క్ విధిగా ధరించాలని వైద్యులు చెబుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రస్తుతం ముఖానికి మాస్క్ తగిలించుకునే తమ పనుల అవసరార్ధం బయట తిరుగుతున్నారు. కానీ మాస్క్ ధరించిన వ్యక్తులను సులభంగా గుర్తు పట్టే అవకాశం ప్రస్తుతం లేకుండా పోయింది.
ఆ మధ్య ఎవరో ఒకరు తాను ఫలానా అని ధరించిన టీ షర్టుపై తన పేరు రాసుకుని వార్తల్లో వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదిగో ఈ నేపథ్యంలోనే కాబోలు… కేరళలోని కొట్టాయంలో గల బీనా లేజర్ టెక్ డిజిటల్ స్టూడియో యజమానికి వినూత్న ఆలోచన కలిగింది. ఇందుకు సాంకేతికతను అతను ఉపయోగించుకోవడమే అసలు విశేషం. బీనా స్టూడియో నిర్వాహకులు ఇందుకు ఏం చేస్తారంటే…? మీరు వెళ్లి ఆ స్టూడియోలో ఓ ఫొటో దిగితే చాలు. మీ ముఖం ఇతరులకు కనిపించే విధంగా మాస్క్ తయారు చేసి ఇస్తారు. ముఖాన్ని కప్పే మాస్క్ మాటున దాగిన రూపాన్ని అచ్చు గుద్దినట్లుగా అచ్చేసి మాస్కు తయారు చేస్తారు. మాస్కు చాటున మూసుకుపోయిన ముఖ ఆకారాన్ని మాత్రమే దానిపై అచ్చేస్తారు. మాస్క్ ధరించగానే మన ముఖ రూపం యథావిధిగా ఇతరులకు కనిపస్తుందన్న మాట.
ఇటువంటి మాస్క్ ధరించి మీరు బయటకు వెళ్లినప్పుడు మీ మిత్రులు, శ్రేయోభిలాషులు మిమ్మల్ని ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే మీ ముఖం మాస్క్ మాటున దాగి ఉన్నట్లు ఏమాత్రం కనిపించదు కాబట్టి. ఈ కొట్టాయం వెరైటి మాస్క్ ధర రూ. 60 మాత్రమే. ఇంకా విషయం అర్థం కాకపోతే కేరళకు చెందిన ‘మీడియా వన్’ అనే న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన ఈ వార్తా కథనాన్ని దిగువన చూసేయండి. మళయాళం భాష అర్థం కాకపోయినా ఫరవాలేదు… భావం తప్పక బోధపడుతుంది. దృశ్య భావానికి భాషతో పరిచయం అక్కర లేదు. ఇక చూసేయండి.